RRR Movie: సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే !

16 May, 2022 10:46 IST|Sakshi

SS Rajamouli RRR Digital Premiere On Zee5 With TVOD Basis: యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి విడుదల అవుతుంది. మే 20న జీ5లో దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం జీ5 తాజాగా షాక్ ఇచ్చింది. 

ఈ సినిమాను మే 20 నుంచి ట్రాన్సాక్షనల్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌ (టీవీవోడీ) పద్ధతిలో అందుబాటులో ఉంటుందని జీ5 తెలిపింది. అంటే మనం మూవీని చూడాలంటే కొంత మొత్తాన్ని చెల్లించి అద్దెకు తీసుకోవాలి. కొంత వ్యవధి వరకు ఆ సినిమా అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో వీలు చూసుకుని మూవీని చూడొచ్చు. జీ5 ఓటీటీ 'జీప్లెక్స్‌' ద్వారా అద్దెప్రాతిపదికన సినిమాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ను అద్దెకు తీసుకోవాలంటే అదనంగా రూ. 100 చెల్లించి మొత్తం రూ. 699 పెట్టి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి (సాధారణంగా జీ5 ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 599తో అందిస్తుంది). ఇలా ఆర్ఆర్ఆర్‌తో కలిపి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి సినిమా 7 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఇదివరకు సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు కూడా 'ఆర్ఆర్ఆర్‌' చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. ఈ పద్ధతి ఎన్నిరోజులు అమలులో ఉంటుందో తెలియదు. 

చదవండి: ఓటీటీలో సినిమాల జాతర.. ఈ శుక్రవారం 13 చిత్రాలు
టాలీవుడ్‌లో ఎన్టీఆర్, సమంత టాప్‌..


మరిన్ని వార్తలు