ET Movie Review: సూర్య ఈటీ (ఎవరికీ తలవంచడు) సినిమా ఎలా ఉందంటే?

10 Mar, 2022 14:04 IST|Sakshi

టైటిల్:​ ఈటీ (ఎవరికీ తలవంచడు)
నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్​ మోహన్​, వినయ్​ వర్మ, సత్యరాజ్​ తదితరులు
నిర్మాత: కళానిధి మారన్ 
రచన, దర్శకుడు: పాండిరాజ్​
సంగీతం: డి. ఇమ్మాన్​
సినిమాటోగ్రఫీ: ఆర్​. రత్నవేలు
ఎడిటర్:​​ రూబెన్​
విడుదల తేది: మార్చి 10, 2022

సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటీ (ఎదుర్కుమ్‌ తునిందవన్‌) తెలుగులో 'ఎవరికీ తలవంచడు' సినిమా వచ్చేసింది. విభిన్నమైన రోల్స్​లో అదరగొట్టే సూర్య సినిమాలపై భారీగానే అంచనాలుంటాయి. ఇదివరకూ సూర్య చేసిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్'​ సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితేనేం బ్లాక్​ బస్టర్ హిట్​ సాధించాయి. సుమారు మూడేళ్ల తర్వాత 'ఎవరికీ తలవంచడు'తో థియేటర్లలోకి వచ్చాడు. సన్ పిక్చర్స్​ అధినేత కళానిధి మారన్​ నిర్మించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్​ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్​ మోహన్​ హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. అమ్మాయిల సమస్యలపై పోరాడే పవర్‌ఫుల్‌ పాత్రలో సూర్య నటించాడని ట్రైలర్​ చూస్తే అర్థమవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 10న (గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. మరీ సూర్య నటించిన ఈటీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
దక్షిణపురంలో అందరితో సరదాగా గడుపుతూ జీవిస్తుంటాడు లాయర్ కృష్ణమోహన్​ (సూర్య). ఇతడు ఉత్తరపురంలోని అధిర (ప్రియాంక అరుల్​ మోహన్​)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు ప్రేమించుకునే క్రమంలోనే వారి గ్రామంలోని అమ్మాయిలు ఆత్మహత్యలు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతుంటారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం ఫలితముండదు. ఇదిలా ఉంటే కృష్ణ మోహన్​, అధిరలు పెళ్లి చేసుకునే క్రమంలో అధిర స్నేహితురాలు ఆపదలో ఉన్నట్లు మెసేజ్ వస్తుంది. దీంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన లాయర్​ కృష్ణమోహన్​కు అమ్మాయిల ఆత్మహత్యలు, యాక్సిడెంట్లకు కారణం, ఆ చావుల వెనక ఉంది ఎవరనేది తెలుస్తుంది. సూర్య వారిని ఎదుర్కొన్నాడా? 500 మంది అమ్మాయిలను ఎలా కాపాడాడు ? దక్షిణపురం, ఉత్తరపురం గ్రామాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ? కృష్ణ మోహన్​ చిన్నతనంలో తన చెల్లెలికి ఏం జరిగిందనేదే సినిమా కథ.

ఎలా ఉందంటే ?
రెండు గ్రామాల మధ్య జరిగిన సంఘటన ద్వారా ప్రారంభమైన సినిమా అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు డైరెక్టర్​ పాండిరాజ్. అమ్మాయిలు అంటే బలహీనం కాదు బలవంతులు అని చాటి చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మాయిలు మనోధైర్యంతో ఎలా ఎదుర్కొవాలో నేర్పిన చిత్రమిది.  రొటీన్​ ఫార్ములా అయినా పవర్​ప్యాక్​ యాక్షన్​ సీన్స్​తో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మంచి సందేశమిచ్చారు. హీరో, విలన్​ల మధ్య వచ్చే సీన్స్​ ఛాలెంజింగ్​గా ఉంటాయి. ఇంటర్వెల్​ యాక్షన్​ సీన్​, మహిళల నగ్న చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూసే జనానికి వాటికి కారకులు ఎవరో తెలిసేలా చేయాలని చూపించే సీన్ సినిమాలో హైలెట్​గా నిలుస్తాయి. 

తప్పు చేయని మహిళలు కాదు అశ్లీల చిత్రాలు తీసేవారు సిగ్గుపడాలని చెబుతూ మహిళలకు ఈ సినిమాతో ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు. 'అబ్బాయిలు ఏడవద్దు అని చెప్పడం కాదు అమ్మాయిలను ఏడిపించొద్దని చెప్పండి' లాంటి మహిళల కోసం చెప్పే డైలాగ్స్​ క్లాప్స్​ కొట్టించేలా ఉన్నాయి. డి. ఇమ్మాన్​ ఇచ్చిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ అయితే అదిరిపోయిందనే చెప్పవచ్చు. సీరియస్​గా సాగే కథలో అక్కడక్కడా వచ్చే ప్రేమ సన్నివేశాలు, కామెడీ సీన్స్​ ఉఫ్​ అనిపిస్తాయి. అమ్మాయిల చావులకు కారణమేంటనే విషయం తెలుసుకోవాలని ఎదురుచూసే ప్రేక్షకుడికి ఈ సీన్స్​ కొంచెం బోర్​ కొట్టిస్తాయి. కానీ లాయర్​ కృష్ణ మోహన్​, అధిరల మధ్య వచ్చే లవ్​ సీన్స్​, ఎమోషనల్​ సీన్స్​ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కామెడీ బాగానే పండిందని చెప్పవచ్చు. ఆకాశమే హద్దురా, జైభీమ్​ తరహాలో కాకపోయినా మహిళల పక్షాన నిలబడిన లాయర్​ కృష్ణమోహన్​ పాత్రలో నటించిన సూర్య 'ఈటీ' చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. 

ఎవరెలా చేశారంటే?
విభిన్నమైన గెటప్పులతో, రోల్స్​తో అదరగొట్టే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పటిలానే ఈ సినిమాలో లాయర్​ కృష్ణ మోహన్​గా తనదైన శైలిలో అద్భుతంగా యాక్ట్​ చేశాడు. అధిరగా చేసిన ప్రియాంక అరుల్​ మోహన్ నటన కూడా బాగుంది. ఫస్టాఫ్​లో సాధారణ యువతిగా నటించి ఆకట్టుకున్న ప్రియాంక సెకండాఫ్​లో అశ్లీల చిత్రాలకు గురైన బాధితురాలిగా పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే పాత్రలో చక్కగా నటించింది. ఇక కృష్ణమోహన్ తండ్రిగా సత్యరాజ్, అమ్మగా శరణ్య పొన్​వన్నన్​, దేవదర్శిని చేతన్​, సుబ్బు పంచు తమదైన పాత్రమేరకు చాలా బాగా యాక్ట్​ చేశారు. 

ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కామ (వినయ్​ రాయ్​). స్త్రీలను కించపరుస్తూ మాట్లాడటం, వాళ్లను హింసించడం, అమ్మాయిలను వీఐపీలకు ఎరగా వేసి వాడుకునే కామేష్​ ​పాత్రలో వినయ్​ రాయ్​ బాగానే నటించాడు. కార్తీ నటించిన 'చినబాబు' సినిమా ఫేమ్​ పాండిరాజ్​కు విలేజ్​ బ్యాక్​డ్రాప్​లో ఇది మూడో సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్​ను ఆకట్టుకునేలా తీయడంలో పాండిరాజ్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించి మహిళలపై జరిగే అరాచాకాలు, వారు ఎలా నిలదొక్కుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో పూర్తిగా విజయం సాధించారనే చెప్పవచ్చు. అమ్మాయిలపై జరిగే ఆకృత్యాలు, అరాచకాలపై చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అమ్మాయిలను పురుషులు చూసే కోణం మారనప్పుడు, మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే రోజు రానంతవరకూ ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా స్వాగతించడంలో తప్పులేదు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు