Producer K Rajan: చిన్న సినిమాలు పరిశ్రమకు పట్టుకొమ్మలు: నిర్మాత కె. రాజన్‌

9 Dec, 2022 10:52 IST|Sakshi

బాస్కెట్‌ ఫిలింస్‌ అండ్‌ క్రియేషన్స్‌ పతాకంపై భాస్కీ దర్శకత్వం వహించిన చిత్రం హై 5. నూతన తారలతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని చెన్నై ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్, పేరరసు, నటుడు, నిర్మాత కే.రాజన్, జాగ్వర్‌ తంగం ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కె.రాజన్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు కుటుంబ అనుబంధాలకు నిలయంగా తమిళనాడు ఉండేదని, అలాంటిది ఇప్పుడు ఒకే ఇంటిలో మనిషికో గది ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్నారు. ఆ ఆవేదనను ఆవిష్కరించే చిత్రంగా హై 5 చిత్రాన్ని రూపొందించారని, అందుకు చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. ఇకపోతే వారీసు చిత్రానికి తెలుగులో థియేటర్లు దొరకడం లేదని ఇక్కడ కొందరు బాధపడుతున్నారని, ఇక్కడ చిత్ర పరిశ్రమకు పట్టుకొమ్మలయిన చిన్న చిత్రాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. హై 5 లాంటి చిన్న సినిమాలు ఆడాలన్నారు.

దర్శకుడు ఆర్వీ ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘హై5’ చిత్ర ట్రైలర్‌ చూస్తున్నప్పుడు హాలీవుడ్‌ చిత్రాన్ని చూసినట్లు అనిపించిందన్నారు. చిత్రాన్ని కెనడాలో చిత్రీకరించినట్లు చెప్పారని, మంచి సందేశంతో రూపొందించిన ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. చిత్ర దర్శక నిర్మాత భాస్కీ మాట్లాడుతూ తల్లిదండ్రులు చివరి దశలో చిన్న పిల్లల మనస్థత్వంతో ప్రవర్తిస్తారని, అయితే ఇంటిలోని వారు దీనిని అర్థం చేసుకోవడం లేదని, తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలని చెప్పే చిత్రంగా ఇది ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు