ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది

16 Apr, 2021 06:49 IST|Sakshi

– తేజ

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా యస్‌.యస్‌. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్క్‌’. ఆర్‌బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్‌ జైన్, వాకాడ అంజన్‌ కుమార్‌ సమష్టిగా నిర్మించిన ‘ఇష్క్‌’ సినిమా ట్రై లర్‌ను సోషల్‌ మీడియాలో హీరో సాయితేజ్‌ విడుదల చేశారు. ఈ సినిమాను ఈ నెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్‌ సినిమా తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్‌’. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.

మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రోత్సహించే మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థవారు కొంత గ్యాప్‌ తర్వాత తెలుగులో చేసిన ఈ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘యూనిట్‌లో అందరి సహకారంతో తక్కువ రోజుల్లో మంచి క్వాలిటీతో ఈ సినిమాను పూర్తి చేశాను. హీరోహీరోయిన్లు తేజ, ప్రియలతో పాటు ఆర్టిస్టు రవీందర్‌ కూడా బాగా నటించారు’’ అన్నారు యస్‌.యస్‌. రాజు. ‘‘సూపర్‌గుడ్‌ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ రెండూ ఒక్కటే. మా బ్యానర్‌ నుంచి వచ్చిన ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆరేడేళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేయలేకపోయాం. ఇప్పుడు ‘ఇష్క్‌’ చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు వాకాడ అప్పారావు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వరసాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, పి. కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు