హీరోలకి బ్లాక్‌ కలర్‌ పులుముతున్న డైరెక్టర్స్‌!

8 Sep, 2022 00:28 IST|Sakshi

క్యారెక్టర్‌ కోసం బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు హీరోలు. ఇప్పుడు కొందరు హీరోలు ‘నల్ల’గా మారిపోయారు. క్యారెక్టర్‌కి తగ్గట్టు బ్లాక్‌ మేకప్‌తో కనిపించడానికి రెడీ అయ్యారు. ఫస్ట్‌ లుక్‌ అంటూ విడుదలైన ఆ పోస్టర్లను చూసి, అభిమానులు ‘బ్లాక్‌.. కిర్రాక్‌’ అంటున్నారు. డిఫరెంట్‌ మేకప్‌తో కొందరు హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

► ప్రభాస్‌ కటౌట్‌కి ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ బ్లాక్‌ కలర్‌ పులిమారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్‌’ సినిమా కోసమే ప్రభాస్‌ బ్లాక్‌ మేకప్‌ వేసుకున్నారు. రెండు భాగాలుగా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించారు. రెండు పోస్టర్స్‌లో బ్లాక్‌ కలర్‌ నిండుగా ఉంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ‘సలార్‌’ సినిమా షూటింగ్‌ జరిగింది. సో.. ప్రభాస్‌ బ్లాక్‌ లుక్స్‌కు కథే కారణమని ఊహించ వచ్చు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

► ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లో నల్లని మేకప్‌లో ఎన్టీఆర్‌ ఫెరోషియస్‌గా కనిపించారు. ఇక హీరోగా ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ చిత్రం కొరటాల శివ డైరెక్షన్‌లో ఉంటుంది. ఆ తర్వాతే ప్రశాంత్‌ నీల్‌తో చేసే సినిమా
ఆరంభమవుతుంది.

► హీరో నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌లో నాని ఫుల్‌ బ్లాక్‌ లుక్‌లో కనిపించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. సో.. ‘దసరా’ ఫస్ట్‌ లుక్‌ అలా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది.

► కామెడీ హీరోగా, వీలైనప్పుడు ఎమోషనల్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ‘అల్లరి’ నరేశ్‌. కాగా 2021లో ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా వచ్చిన ‘నాంది’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాకు విజయ్‌ కనకమేడల దర్శకుడు. ఇప్పుడు ‘అల్లరి’ నరేశ్, విజయ్‌ కనకమేడల మరో ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యారు. ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌లో ఫుల్‌గా మసి పూసుకుని ఉన్నారు నరేశ్‌. 

మరిన్ని వార్తలు