K Viswanath Death : కె. విశ్వనాథ్‌ కడసారి చూపు కోసం తరలి వచ్చిన సినీ ప్రముఖులు

3 Feb, 2023 09:14 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు పరిశ్రమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్‌ ఇక లేరన్న వార్త తెలుసుకొని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది.

పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కె. విశ్వనాథ్‌ చివరి చూపు కోసం సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెంకటేశ్‌, మణిశర్మ, గుణశేఖర్‌, పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌, సాయికుమార్‌ వంటి పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కె. విశ్వనాథ్‌ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

విశ్వనాథ్ గారు లేరనే వార్త నన్ను బాధకు గురిచేసింది నాకు పితృసమానులు. విశ్వనాథ్ చిత్రాలు పండితుల నుంచి పామరుల వరకు అలరించాయి జనరంజకం చేస్తూ బ్లాక్ బస్టర్ చేయడం అనేది ఆయన కృషికి నిదర్శనం.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఆయన దర్శకత్వంలో నేను నటించడం అదృష్టం. మా లాంటి నటులకు విశ్వనాథ్ ఓ గ్రంథాలయం. ఆయన చేత్తో అన్నం తినిపించిన గొప్ప వ్యక్తి. 'ఇంద్ర' సమయంలో వారణాసికి పిలవడంతో వచ్చారు ఆయన ప్రేమ వాత్సల్యం పొందిన నేను తండ్రిని పొగొట్టుకున్నంత బాధగా ఉంది- చిరంజీవి 

► కె. విశ్వనాథ్‌ గారి మరణం చాలా బాధాకరం.ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం.ఆయన తెలుగు సినిమాకు మూలస్తంభం. తన సినిమాల ద్వారా సంస్కృతిని తెలియజేశారు. విశ్వనాథ్‌ గారి మరణం సినిమా రంగానికి తీరని లోటు అంటూ పపన్‌ కల్యాణ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

► విశ్వనాథ్‌ గారు ఈరోజు లేరనే వార్త చాలా షాకింగ్‌గా, బాధగా అనిపిస్తుంది. దేశంలోని అత్యత్తుమ డైరెక్టర్లలో ఆయన ఒకరు. పాత తరమే కాదు, ఈనాటి జనరేషన్‌ కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటాయి
- విక్టరీ వెంకటేశ్‌

► పుట్టినప్రతివాడికి మరణం తప్పదు. కానీ విశ్వనాథ్ గారి మరణం చాలా గొప్పది. - ఆయాన సినిమాల్లో నేను నటించాను. - ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. - ఆయన కుటుంబంతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. - ఆయన లేడు అనేది చాలా బాధాకరం. - భారతీయ చలన చిత్రాలలో విరబూసిన కమలం ఆయన
- బ్రహ్మానందం

► కళా తపస్వి అన్న పేరుకు ఆయనే నిలువెత్తు సాక్ష్యం. ఆయన కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి మనిషి ఈరోజు లేరన్నది నిజం. కానీ ఇప్పుడు ఆయన్ను చూస్తుంటే యోగ నిద్రలో ఉన్నట్లున్నారు. ఒక భీష్మాచార్యుడిలాగా కనిపించారు. ఆయన ఆశీస్సులు మన అందరికి ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో సినిమాలు తీయాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి
- సాయికుమార్‌

► దర్శకత్వపు ప్రాథమిక సూత్రాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ఆయన సినిమాలు మాలాంటి వాళ్లు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. కాబట్టి ఆయన ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. పాతతరమే కాదు యువతరం కూడా ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి
- గుణశేఖర్‌

కె. విశ్వనాథ్‌ గారు గొప్ప మనిషి. ఆయనతో పనిచేసిన రోజుల్ని మర్చిపోలేను. ఈమధ్యే ఆయన్ను కలిశాను. ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిపోయింది. కానీ దానికి పునాదులు వేసింది మాత్రం కె. విశ్వనాథ్‌ గారే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
- సినీ నటి రాధిక

► ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది. అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించిన గొప్పవాళ్లలో కె. విశ్వనాథ్‌ది అగ్రతాంబూలం
- పరచూరి గోపాలకృష్ణ

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు