ఆ వార్తల్లో నిజం లేదు: హీరో విజయ్‌ టీం

5 Nov, 2020 19:05 IST|Sakshi

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ఆయన తన పార్టీని కూడా నేడు రిజిస్టర్‌ చేయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఇళయ దళపతి విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఖరారైందంటూ అతడి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. విజయ్‌ రాకతో తమిళ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం అభిమానుల అత్యుత్సాహమే అని తేలింది. (చదవండి: మిస్‌ ఇండియా మూవీ రివ్యూ)

ఈ నేపథ్యంలో విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై అతడి పీఆర్‌ఓ టీం తాజాగా ట్విటర్‌ వేదికగా స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేసింది. ఈ మేరకు... ‘‘ బ్రేకింగ్‌: దళపతి విజయ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద తన రాజకీయపార్టీని రిజిస్టర్‌ చేయించారంటూ ప్రచారమవుతున్న వార్తలు నిజం కాదు’’ అంటూ విజయ్‌ పీఆర్‌ఓ రియాజ్‌ అహ్మద్‌ ట్వీట్‌ చేశాడు. కాగా విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖరన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయాక్కం’’పేరిట పొలిటికల్‌ పార్టీని రిజిస్టర్‌ చేయించేందుకు దరఖాస్తు చేశాను. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఇది విజయ్‌ పొలిటికల్‌ పార్టీ కానేకాదు. తను రాజకీయాల్లోకి వస్తాడో రాడో అన్న విషయం గురించి నేనేం చెప్పలేను’’ అని వ్యాఖ్యానించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మేరకు వార్తలు వెలువడినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు