అభిప్రాయభేదాలు ఉంటే మంచిదే!

31 Dec, 2022 01:06 IST|Sakshi
సంభాషణల రచయిత సాయిమాధవ్‌ బుర్రా

– సాయిమాధవ్‌ బుర్రా

‘‘డైలాగ్‌ రైటర్‌గా నాకు ప్రతి కొత్త సినిమా ఓ సవాలే. హీరో ప్రాత్ర, సన్నివేశం, హీరో ఇమేజ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ డైలాగ్స్‌ రాయాలి. కేవలం స్టార్‌ ఇమేజ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్‌ రాయడం అనేది కరెక్ట్‌ కాదని నా భావన. నేను అలా రాయను’’ అన్నారు రచయిత సాయిమాధవ్‌ బుర్రా. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర సంభాషణల రచయిత సాయిమాధవ్‌ బుర్రా చెప్పిన విశేషాలు.

► బాలకృష్ణగారితో నేను చేసిన నాలుగో సినిమా ‘వీరసింహారెడ్డి’. అలాగే ‘క్రాక్‌’ తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో నేను చేసిన రెండో సినిమా కూడా ఇదే. ఈ సినిమా కథా చర్చల సమయం నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్‌ అయ్యాను. ఈ సినిమాలో ఓ  కొత్త ప్రాయింట్‌ ఉంది. ఒక పక్కా కమర్షియల్‌ సినిమాకు ఇలాంటి ఓ కొత్త పాయింట్‌ కలవడం అనేది చాలా అరుదు. ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, బాలకృష్ణగారి నుంచి కోరుకునే అన్ని అంశాలతో ‘వీరసింహారెడ్డి’ రూపొందింది.

► కథా చర్చల్లో భాగంగా అభిప్రాభేదాలు ఉండొచ్చు. అవి ఉన్నప్పుడే పని కరెక్ట్‌గా జరుగుతున్నట్లు అర్థం. అన్నీ కూడా సినిమా అవుట్‌పుట్‌ బాగా రావడం కోసమే. ఒకసారి కథను ఓకే చేశాక బాలకృష్ణగారు అందులో ఇన్‌వాల్వ్‌ అవ్వరు. సందర్భానుసారంగా కొన్ని డైలాగ్స్‌ ఇంప్రొవైజేషన్స్‌ ఉండొచ్చు. ఇవన్నీ సినిమా జర్నీలో భాగం. కన్విన్స్‌ చేయడం, కన్విన్స్‌ అవ్వడం.. ఈ రెండు లక్షణాలు ఉన్న గొప్ప దర్శకుడు గోపీచంద్‌ మలినేనిగారు. మైత్రీ మూవీ మేకర్స్‌ వంటి నిర్మాతల వల్ల ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది.

► కొంతమంది రచయితలు ఇండస్ట్రీకి దర్శకులు కావాలని వచ్చి, రైటర్స్‌గా  మొదలై, ఫైనల్‌గా దర్శకుడిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారు. నేను రచయితను కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. రైటర్‌గా రాణిస్తున్నాను. ప్రస్తుతానికైతే డైరెక్షన్‌ ఆలోచన లేదు.  

► 2017 సంక్రాంతికి చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణగారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకూ నేను పని చేశాను. రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’కు నేను చేయక΄ోయినా అదీ నా సినిమాగానే భావిస్తాను. ఎందుకంటే చిరంజీవిగారికి నేనంటే అభిమానం. దర్శకుడు బాబీ నా మిత్రుడు. ఈ రెండు చిత్రాలూ సక్సెస్‌ అవ్వాలి.

► ప్రస్తుతం ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’, పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’, హీరో రామ్‌చరణ్‌–దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌ సినిమా, అర్జున్‌ దర్శకత్వంలోని సినిమా, నిర్మాత కేఎస్‌ రామారావు సినిమాలు చేస్తున్నాను.  

మరిన్ని వార్తలు