రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌

1 Jun, 2021 20:33 IST|Sakshi

దర్శకుడు అవ్వాలన్నది రాజమౌళి ఆలోచనే అని తనది కాదని ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇటీవల ఓ షోకు అతిథిగా వచ్చిన ఆయన దర్శక ధీరుడు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజమౌళిని డైరెక్టర్‌ చేయాలని నేనేప్పుడు అనుకోలేదు. ఆ ఆలోచన తనకే వచ్చింది. తను ఇంటర్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత డిగ్రీలో బీఎస్సీ చదవాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. అది తెలిసి తాను డిగ్రీ చదవనని నాతో చెప్పాడు. ఆర్థిక పరిస్థితి కూడా సహకరించకపోయేసరికి నేను ఏం చెప్పలేకపోయాను. ఇక ఖాళీగా చెన్నై రోడ్లపై బలాదూర్‌గా తిరుగుతూ ఉండేవాడు’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇక కొద్ది రోజులకు నేనే రాజమౌళిని పిలిచి ఏం చేద్దామనుకుంటున్నావ్‌ అని అడగడంతో వెంటనే డైరెక్షన్‌పై ఆసక్తి ఉందని, అదే చేస్తానని చెప్పాడన్నారు. దీంతో  దర్శకుడు కావడమంటే అంత తేలికైన విషయం కాదని, డైరెక్షన్‌కు సంబంధించిన అన్ని శాఖలపై పట్టుండాలి.. అప్పుడే నిన్ను డైరెక్షన్‌ డిపార్టుమెంటులో పెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారని చెప్పి ముందుగా అవి నేర్చుకొమ్మని వివరించానన్నారు.

‘దాంతో రాజమౌళి ముందుగా ఎడింగ్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత కీరవాణి దగ్గర మ్యూజిక్‌పై అవగాహన పెంచుకున్నాడు. ఇక నా దగ్గర కూర్చుని కథలపై శ్రద్ద పెట్టాడు. అంతేగాక ఒక కథలో ఎక్కడ ఏయే విషయాలు చెప్పాలి, ఎలా వివరించాలి అనే విషయాలపై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు పిలిచి తనకు శాంతినివాసం సీరియల్‌లో అవకాశం ఇచ్చారు’ అని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు