డాక్టర్‌ ‘ఎమ్మెల్యే’..!

12 Nov, 2023 00:52 IST|Sakshi

సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వైద్య వృత్తి నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఎంబీబీఎస్‌ చదివిన తర్వాత 1976 నుంచి నాగర్‌కర్నూల్‌లో డాక్టర్‌ సేవలందించిన ఆయన ఎన్‌టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వీ.నారాయణగౌడ్‌ చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1994, 1999, 2004,2009, 2012లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో చంద్రబాబు కేబినెట్‌లో తొలిసారిగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మద్యనిషేధం, అటవీ, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే అలంపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వీఎం అబ్రహం డాక్టర్‌గా రాణించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1974లో హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తర్వాత.. 12 ఏళ్ల పాటు అరబ్‌ దేశాల్లో వైద్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత కర్నూలుకు ఆస్పత్రి ఏర్పాటు చేసి 22 ఏళ్ల పాటు సేవలు అందించారు. తొలిసారిగా 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరుఫున బరిలోకి దిగి ఓడిపోగా.. 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి రెండోసారి అసె ంబ్లీలో అడుగుపెట్టారు. మారిన రాజకీయ పరిస్థితులు, యువనాయకత్వం, తదితర కారణాలతో వీరికి ఈసారి పోటీ చేసే అవకాశం దక్కలేదు.

స్టెతస్కోప్‌ వదిలి.. అధ్యక్షా పిలుపు వైపు..

ఉమ్మడి జిల్లాలో

ఎన్నికల బరిలో పలువురు వైద్యులు

ఇప్పటికే ప్రజాజీవితంలో రాణించిన

నాగం, లక్ష్మారెడ్డి, వంశీకృష్ణ, అబ్రహం

తాజాగా పోటీలో నిలిచిన

రాజేశ్‌రెడ్డి, పర్ణికారెడ్డి

సర్పంచ్‌ నుంచి మంత్రిగా..

వైద్య విద్యను అభ్యసించిన జడ్చర్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజకీయాల్లో రాణించారు. జడ్చర్ల నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో బీహెచ్‌ఎంఎస్‌ విద్యను పూర్తిచేశారు. వైద్య విద్య పూర్తవగానే యుక్తవయస్సులోనే లక్ష్మారెడ్డి 1988లో ఆవంచ సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో క్రీయాశీలక పాత్ర పోషించారు. తిమ్మాజిపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో తిమ్మాజిపేట సింగిల్‌విండో అధ్యక్షుడిగా, 1996లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు. 1999లో జడ్చర్ల ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. తదుపరి 2001లో బీఆర్‌ఎస్‌లో చేరి 2004 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టికెట్‌ దక్కలేదు. 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో జడ్చర్ల ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

వైద్య విద్యను పూర్తిచేసిన పలువురు డాక్టర్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ప్రజాక్షేత్రంలో తలపడనున్నారు. ఎండీ, ఎంఎస్‌, ఎంబీబీఎస్‌, ఎండీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ తదితర వైద్యశాస్త్ర కోర్సులను పూర్తిచేసిన విద్యావంతులు ఎమ్మెల్యేగా పోటీపడుతున్నారు. ఇప్పటికే మాజీమంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వీఎం అబ్రహం తదితరులు ఎమ్మెల్యేలుగా రాణించగా.. వీరి స్ఫూర్తితో మరింత మంది వైద్యులు రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

– సాక్షి, నాగర్‌కర్నూల్‌

కాంగ్రెస్‌ అభ్యర్థిగా

డెంటిస్టు..

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి కర్ణాటకలోని బాపూజీ డెంటల్‌ కళాశాలలో ఎండీఎస్‌ పూర్తిచేశారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. రాజేశ్‌రెడ్డి తెలంగాణ డెంటిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

‘పేట’ బరిలో రేడియాలజిస్ట్‌..

నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం భాస్కర మెడికల్‌ కళాశాలలో పీజీ (రేడియాలజి) చదువుతున్నారు. పర్ణికారెడ్డి తాత దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆమె తండ్రి పీసీసీ సభ్యుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి 2005లో మావోయిస్టుల కాల్పుల్లో మరణించారు. ఈమె తల్లి లక్ష్మి ఐఏఎస్‌ అధికారి కాగా.. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మక్తల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఈమెకు పెదనాన్న కాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మేనత్త అవుతారు.

ప్రభుత్వ వైద్యుడి నుంచి..

చ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ వంశీకృష్ణ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ మండలం ఎల్మపల్లి గ్రామవాసి. 1997లో ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌, ఆ తర్వాత ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌ పూర్తి చేశారు. కొంతకాలంపాటు లింగాల పీహెచ్‌సీ వైద్యుడిగా పనిచేశారు. 1999లోప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా అప్పటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి.రాములు చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో పి.రాములుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014, 2018లో వరుస ఎన్నికల్లో బరిలో నిలిచి ఓడిపోయారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో..

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఆలిండియా హిందుస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ పగిడాల శ్రీనివాసరెడ్డి నామినేషన్‌ వేశారు. ఎంఎస్‌ చదువుకున్న శ్రీనివాసరెడ్డి గతంలో కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం సుధానర్సింగ్‌ హోం పేరుతో ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. 20 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీడీపీలో చేరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచేందుకు సిద్ధం కాగా.. పోటీ చేయొద్దన్న నిర్ణయం నేపథ్యంలో ఆలిండియా హిందుస్థాన్‌ కాంగ్రెస్‌పార్టీ తరపున నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ సారి అవకాశం రాక..

మరిన్ని వార్తలు