శనేశ్వరుడికి తిలతైలాభిషేకం

12 Nov, 2023 00:52 IST|Sakshi

బిజినేపల్లి: శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా మండలంలోని నందివడ్డెమాన్‌కి చెందిన జైష్ట్యాదేవి శనేశ్వరుడికి తిలతైలాభిషేక వర్షాన్ని తలపించేలా భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శనేశ్వరుడికి భక్తుల చేత గోత్రనామార్చన, ప్రదక్షిణలు, తిలతైలాభిషేకాలు, జిల్లెడు పూల సమర్పణ వంటి పూజలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని శనిదోష నివారణకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, శివుడిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఎస్టీయూ జిల్లా

కార్యవర్గం ఎన్నిక

కందనూలు: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) నాగర్‌కర్నూల్‌ జిల్లా వార్షిక కౌన్సిల్‌ సమావేశాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత బాలుర పాఠశాలలో నిర్వహంచారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.పర్వతరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎన్నికను కొనసాగించారు. జిల్లా అధ్యక్షుడిగా మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మామిళ్ల సుదర్శన్‌, కోశాధికారిగా బి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.పర్వత్‌ రెడ్డి, కొత్త శ్రీధర్‌ రావు, ఎస్‌.ఈశ్వర్‌, పి.సతీష్‌, కే.రమేష్‌, అనిల్‌ కుమార్‌ రెడ్డి, భోజరాజు, హనుమంతు రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మారావులను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీకి ఎంపికై న వారిని అభినందించారు. ఉపాధ్యాయ సమస్యలపై నిత్యం పోరాడుతూ ఉపాధ్యాయుల సేవలో ఉండాలని పర్వత్‌ రెడ్డి నూతన కమిటీకి సూచించారు.

పంట నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం

పెబ్బేరు రూరల్‌: ఉమ్మడి వీపనగండ్ల మండలంలో సాగునీరందక వరి పంటలు ఎండి రైతులు నష్టపోయారని.. పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం ప్రతినిధి బృందం రైతులతో కలిసి పలు గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించిందని తెలిపారు. పీజేపీ ప్రధాన ఎడమ కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీరందక వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని తూముకుంట, సంపట్రావ్‌పల్లి, కొండూరు, సింగోటం, కొప్పునూర్‌, పెద్దమారూర్‌, పెద్దదగడ, చెల్లెపాడు, అయ్యవారిపల్లి, కాలూరు, చిన్నమారూర్‌లో సుమారు 10 వేల ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో గొర్రెలను మేపుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిన వరి పంట ఎకరాకు రూ.35 వేలు, వాణిజ్య పంటలకు రూ.75 వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తోందన్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాకార్యవర్గసభ్యుడు ఎం.ఆంజనేయులు, కార్యదర్శి రాజేందర్‌గౌడ్‌, జి.వెంకటయ్య, కురుమూర్తి, దర్గాస్వామి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు