నేటి నుంచి శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి వసంతోత్సవాలు

22 Mar, 2023 02:30 IST|Sakshi
ఆలయంలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి, ఆలయ ప్రధాన గోపురం

బనగానపల్లెరూరల్‌: భక్తుల కోరికలు తీర్చే మహిమాన్వితురాలిగా ఖ్యాతి పొందిన నందవరం చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు నిర్వహించే వేడుకలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. తొగట వీర క్షత్రియుల జ్యోతుల ప్రదర్శన కార్యక్రమం ఉత్సవాలకే ప్రత్యేకం. ఉత్సవాల్లో భాగంగా 22వ తేదీ ఉదయం అంకురార్పణ పూజలు, సాయంత్రం పన్నేరపు బండ్లు తిప్పు కార్యక్రమం ఉంటుంది. 23న శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి కల్యాణో త్సవం, గ్రామోత్సవం, 24న సాయంత్రం అమ్మవారి రాయభార మహోత్సవం, 25న రాత్రి 12 గంటలకు అమ్మవారికి దిష్టి చుక్క పెట్టుట, అనంతరం జ్యోతి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 26న సాయంత్రం అమ్మవారి రథోత్సవం, 27న తిరుగు రథోత్సవం, 28న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఉత్సవాల్లో జ్యోతులు ప్రత్యేకం

ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ రాత్రి జరిగే జ్యోతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో తొగట వీరక్షత్రియులు నందవరం గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలోని శ్రీచెన్నకేశవ స్వామి దేవాలయం సమీపం నుంచి భక్తులు గోధుమ పిండి, నెయ్యి, బెల్లం పాకంతో తయారు చేసిన పదార్థంతో జ్యోతిని వెలిగించుకొని భక్తులు తలపై పెట్టుకొని భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రదర్శనగా శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసి న అగ్నిగుండంలో జ్యోతితో వచ్చిన భక్తులు నడిచి వెళ్లి భక్తిని చాటుతారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. సుమారు 400 నుంచి 500 వరకు జ్యోతులను భక్తులు ప్రదర్శిస్తారు. అలాగే ఈ జ్యోతి ఉత్సవాన్ని చూసేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరిన్ని వార్తలు