ప్రేమను గెలిపించేందుకు..

22 Mar, 2023 02:30 IST|Sakshi
వీరభద్రస్వామి ఆలయం,(ఇన్‌సెట్‌) మూలవిరాట్‌

ఆస్పరి: చాలా చోట్ల మనం ప్రేమను వ్యతిరేకించే, ప్రేమికులను విడగొట్టే పెద్దలను చూసుంటాం. అందుకు భిన్నంగా ప్రేమను గెలిపించేందుకు ఆ ఊరిలో యుద్ధం చేస్తారు. అందులో విజ యం కూడా సాధిస్తారు. పిడకల సమరంగా పిలుచుకునే ఈ సంప్రదాయానికి కై రుప్పల గ్రామం మరోసారి సిద్ధమవుతోంది.

నేపథ్యమిదీ..

కై రుప్పల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి విహార యాత్రకు వెళ్లగా కాళికాదేవి తారస పడుతుంది. ఆమెతో ప్రేమలో పడి వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే, ఆ తర్వాత స్వామి తన మాట తప్పడంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహం వస్తుంది. వీరభద్ర స్వామి, ఆయన వర్గీయులను అవమాన పరచాలని నిర్ణయించుకుని కాళికాదేవి వర్గీయులు తమకు అందుబాటులో ఉన్న పిడకల (పేడ)తో వారిపై దాడికి దిగుతారు. స్వామి వర్గీయులు కూడా అవే పిడకలతో ఎదురు దాడి చేస్తారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ పోరు రణరంగాన్ని తలపిస్తుంది. చివరకు గ్రామ పెద్దలు పంచాయితీ చేసి నిమ్న కులానికి చెందిన కాళికాదేవిని, అగ్రవర్ణానికి చెందిన వీరభద్రస్వామిని వివాహం చేశారని గ్రామస్తులు చెబుతారు. కాగా తమ ప్రేమను గెలిపించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన తమ వర్గీయులకు వీరభద్రస్వామి, కాళికాదేవి కోరిన కోరికలు తీర్చారని పెద్దలు చెబుతారు. నాటి నుంచి ప్రతి ఏడాది వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉగాది పండుగ మరుసటి రోజు పిడకల సమరం (సంబరం)జరుపుకోవడం గ్రామంలో ఆనవాయితీగా వస్తుంది.

ఉత్సవాల్లో కారుమంచి వంశస్తులు ప్రత్యేకం

స్వామి ఉత్సవాల్లో కారుమంచి పెద్దరెడ్డి వంశస్తులు రాచరికాన్ని గుర్తుకు తెస్తారు. ఈ వంశస్తుల్లో ఒకరు పిడకల సమరం రోజు శిరస్సున కిరీటం ధరించి ఖడ్గం చేతబూని షేర్వాణి దుస్తుల్లో కారుమంచి నుంచి అశ్వంపై కై రుప్పల గ్రామానికి తన అనుచరులతో చేరుకుంటారు. కారుమంచి రెడ్డి వచ్చిన తర్వాత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కారుమంచి వైపు వెళ్తాడు. తర్వాత పిడకల సమరం మొదలవుతుంది. పూర్వం కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్తులు ఆలయ అభివృద్ధికి కీలక పాత్ర పోషించడంతో ఇప్పటికీ ఆ కుటుంబానికి స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు.

రేపు కై రుప్పలలో పిడకల సమరం

అనాదిగా వస్తున్న సంప్రదాయం

భారీగా తరలిరానున్న భక్తులు

సమరం సాగుతుందిలా..

కోరిన కోరికలు నెరవేరితే స్వామికి భక్తులు నగలు,పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించడం సాధారణం. అయితే, అందుకు భిన్నంగా కై రుప్పల గ్రామంలో స్వామికి పిడకలు సమర్పిస్తారు. ఆచారం ప్రకారం పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి, బిల్లేకల్‌ తదితర గ్రామాల ప్రజలు ఒక నెల ముందు నుంచే ఇంటిలో ఉన్న పశువుల పేడతో పిడకలు తయారు చేసుకుంటారు. వాటిని ఉగాది మరుసటి రోజు దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవాళ్లతో ముసుగు వేసుకుంటారు. అరగంట పాటు జరిగే ఈ సమరంలో చాలా మంది భక్తులు గాయాలకు గురవుతారు. తర్వాత దెబ్బ తగిలిన చోట స్వామివారి బండారం రాసుకుని ఇంటి ముఖం పడతారు.

మరిన్ని వార్తలు