తర్తూరు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

23 Mar, 2023 01:10 IST|Sakshi

జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉల్ఫావంశానికి చెందిన ఆలయ అర్చకుడు వినాయకుడికి ప్రథమ పూజ చేసి ప్రారంభించారు. తర్వాత శేషవాహనంపై నిద్రిస్తున్న శ్రీలక్ష్మీరంగనాథుని మూల విగ్రహంతో పాటు చెక్కబొమ్మ రూపంలో ఉన్న స్వామివారి నిజరూపానికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు ప్రభోత్సవ వాహనాన్ని వెలికితీసి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సిద్ధం చేశారు. ఈనెల 29 నుంచి పదిరోజుల పాటు స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

అయ్యప్పస్వామికి

మణికంఠహారం

బనగానపల్లె: పట్టణంలోని బేతంచెర్ల రోడ్డులో వెలసిన శ్రీ అయ్యప్పస్వామికి పలుకూరు గ్రామానికి చెందిన జింకల వెంకటసుబ్బయ్య, రామలక్ష్మమ్మ దంపతులు మణికంఠహారం విరాళంగా అందజేశారు. రూ. 2.50 లక్షలు విలువ చేసే ఆ హారాన్ని స్వామిపై భక్తితో అందించినట్లు దాతలు తెలిపారు. ఆలయ చైర్మన్‌ యాతం వెంకటసుబ్బారెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భరతుడు, పుల్లయ్య, మురళీ తదితరులు వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఆరుపదుల వయసు.. 112వ సారి రక్తదానం

డోన్‌ టౌన్‌: అన్ని దానాల్లో రక్తదానం మిన్న అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందకపోతే కొన్ని సార్లు ప్రాణాలు పోతుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పలువురు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయినా, కూడా కొందరు రక్తదానం చేసేందుకు భయపడుతుంటారు. కానీ ఆరుపదుల వయసులో 112వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు డోన్‌ పట్టణానికి చెందిన కోలా గోపీనాథ్‌. ‘ఎ’ పాజిటివ్‌ రక్త గ్రూపు కలిగిన ఈయన ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని బుధవారం కర్నూలు బ్లడ్‌ బ్యాంకుకు వెళ్లి రక్తదానం చేశాడు. విషయం తెలుసుకున్న ద్రోణాచలం సేవా సమితి సభ్యులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రాధాన్యత భవన

నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి

కర్నూలు(అర్బన్‌): ప్రభుత్వ ప్రాధాన్యత భవన (ఆర్‌బీకే, గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌) నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పీఆర్‌ ఎస్‌ఈ కే సుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు ఇంజినీర్లకు సూచనలు జారీ చేసినట్లు చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు 456 ప్రారంభం కాగా ఇప్పటి వరకు 136 పూర్తయ్యాయని, 305 భవన నిర్మాణాల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 15 భవన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. అలాగే 446 ఆర్‌బీకేలకు గాను ఇప్పటి వరకు 80 పూర్తి కాగా, 330 వేర్వేరు దశల్లో ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు