103 ఏళ్ల పెద్దాయన మనోధైర్యానికి తలవంచిన కోవిడ్‌

9 May, 2021 11:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. అన్ని వయసుల వారు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులపై కోవిడ్‌ రక్కసి పంజా విసురుతోంది. వైరస్‌ మృతుల్లో ఎక్కువ సంఖ్యలో వయసుమళ్లినవారే ఉంటున్నారు. అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన 103 ఏళ్ల వృద్ధుడు ఒకరు కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. వైరస్‌పై విజయానికి చికిత్సతోపాటు మనోధైర్యం ముఖ్యమని నిరూపించాడు. వీరేంద్ర నగర్‌ ప్రాంతానికి చెందిన శ్యామ్‌రావ్‌ ఇంగ్లేకు కరోనా సోకడంతో పాల్ఘర్‌లోని కోవిడ్‌-19 ఆస్పత్రిలో గత ఆదివారం చేరారు.

వారంపాటు చికిత్స పొందిన అనంతరం వైరస్‌ నుంచి కోలుకున్నారు. శనివారం చేసిన నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. కోవిడ్‌ నుంచి కోలుకున్న శ్యామ్‌రావ్‌ను శనివారం డిశ్చార్జ్‌ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మాణిక్‌ గురుసాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చికిత్సకు పెద్దాయన బాగా స్పందించాడని, వైద్య సిబ్బందితో సహకరించాడని ఆస్పత్రి వైద్యులు అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు పాల్ఘర్‌ జిల్లా కలెక్టర్. ఇక పాల్ఘర్‌ జిల్లా వ్యాప్తంగా 95,682 పాజిటివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 1715 కోవిడ్‌ మరణాలు సంభవించాయి.
(చదవండి: బాబ్బాబు..ఏ సెంటర్‌లో ఏ వ్యాక్సిన్‌ వేస్తున్నారో చెప్పండయ్యా)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు