‘మహా’ విషాదంలో 13 మంది మృతి 

26 Aug, 2020 03:03 IST|Sakshi
సంఘటన ప్రాంతంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

కొనసాగుతున్న సహాయక చర్యలు 

ప్రాణాలతో బయటపడ్డ నాలుగేళ్ల బాలుడు

ముంబై: మహారాష్ట్రలో ఐదంతస్థుల భవనం కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మహమ్మద్‌ నదీమ్‌ బతికి బయటపడ్డాడు, శిథిలాల నుంచి ఇప్పటికి 12 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. భవనం కూలేటప్పుడు ఎగిరివచ్చిన రాయి ఒకటి తలకు తగిలి మరో వ్యక్తి మరణించినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతానికి 9 మందిని కాపాడామని అధికారులు చెప్పారు. మరో ముగ్గురి జాడ ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 304, 338 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్‌ చేశారు. కేసులో బిల్డర్‌ ఫరూక్‌ ఖాజీ, ఆర్కిటెక్ట్‌ గౌరవ్‌ షా సహా ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు.  

కళ్లముందే పిల్లర్లు బద్దలు 
భవనం కూలే సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్తంభాలు బీటలిచ్చి ముక్కలవడం చూశానని ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్షసాక్షి ముస్తఫా ఛపేకర్‌ చెప్పారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనం కూలడానికి ముందు తనకు ప్రకంపనలు తెలిశాయని, దీంతో బాల్కనీలోకి పరిగెత్తి ఏం జరుగుతుందో తెలుసుకునే యత్నం చేశానని చెప్పారు. బయటున్న వారు వెంటనే తనను భవనం వెలుపలకు రమ్మని చెప్పారని, దీంతో తాను, కుటుంబ సభ్యులు బయటకు పరిగెత్తామని తెలిపారు. బయటకు వచ్చేముందు తన పొరుగువారికి విషయం చెప్పి హెచ్చరించానన్నారు. దాదాపు బయటకు వచ్చాక వెనక్కు చూస్తే గ్రౌండ్‌ఫ్లోర్‌లో పిల్లర్లు పెద్ద శబ్దంతో ముక్కలవడం కనిపించిందన్నారు. భవన నిర్మాణంలో లోపాలను పలుమార్లు బిల్డర్‌ను కలిసి వివరించినా, తను రిపేరు పనులు చేయించడానికి సుముఖత చూపలేదని విమర్శించారు. భవనం కట్టాక తనకేమీ సంబంధంలేదన్నాడని తెలిపారు.

అన్నిరకాలుగా సాయం 
బిల్డింగ్‌ కూలిన ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీములు  సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 50 వేల రూపాయల సాయం అందించనుంది.

మృత్యుంజయుడు... 
ఏం జరిగిందో తెలియదు. అమ్మ ఎక్కడుందో తెలియదు. చిమ్మచీకటి. చుట్టూ శిథిలాలు. ఏకంగా 19 గంటల పాటు దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ఓ నాలుగేళ్ల బాలుడు... చివరకు సురక్షితంగా బయటపడ్డాడు. రక్షణ చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో మహమ్మద్‌ నదీమ్‌ బాంగీని సజీవంగా చూడగానే ఒక్కసారిగా ఆనందం. గ్యాస్‌ కట్టర్లు, ఇతర యంత్ర సామగ్రిని ఉపయోగించి శిథిలాలను తొలగించారు. జాగ్రత్తగా బయటకు తెచ్చారు. ఊపిరిబిగపట్టి చూస్తున్న స్థానికుల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు. ‘గణపతి బప్పా మోరియా’అంటూ నినదిస్తూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

చిన్నచిన్న గాయాలు తప్పితే... నదీమ్‌ బాగానే ఉన్నాడు. వెంటనే అంబులెన్స్‌లో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే... మరో 20 నిమిషాల తర్వాత అతని మాతృమూర్తి శిథిలాల కింద విగతజీవిగా కనిపించింది. ఈ బాలుడి తల్లి నౌషీన్‌ నదీమ్‌ బాంగీ (30), అక్క అయేషా (7), చెల్లెలు రుకయ్యా (2) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్‌లో పనిచేస్తున్న తండ్రి నదీమ్‌ హుటాహుటిన బయలుదేరి మహద్‌కు చేరుకున్నారు. 26 గంటలపాటు శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల మహిళ మెహరున్నీసాను సహాయక సిబ్బంది రక్షించారు. కూలిన భవనంలో ఆమె ఐదో అంతస్తులో నివసించేవారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా... మంగళవారం రాత్రి 9.35 గంటలకు శిథిలాల్లో ఎవరో కదులుతున్నట్లు గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మెహరున్నీసాను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు