టీకా కలకలం.. ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్‌.. ఎక్కడో తెలుసా?

28 Jul, 2022 08:10 IST|Sakshi

Vaccinated 30 Students With One Syringe.. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు స్థాయిలో 200కోట్ల డోసులకుపైగా టీకాలను అందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారతీయులపై ప్రశంసలు కురిపించారు. 

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సినేషన్‌ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే, దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న స్థానికులు అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు స్పష్టం చేశారు. 

వివరాల ప్రకారం..సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. అది గమనించిన విద్యార్థులు పేరెంట్స్‌ ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పై అధికారులు ఒకే సిరంజీ పంపించారని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఇలా టీకా వేయడంలో తప్పు ఏముంది అంటూ వ్యాఖ్యలు చేయడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో, పిల్లల పేరెంట్స్‌ అతడిపై దాడి చేసినంత పనిచేశారు. 

ఈ విషయం.. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ దృష్టికి చేరడంతో ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జితేంద్ర.. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉల్లఘించారని తెలిపారు. అందుకే జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్‌ క్షితిజ్ సింఘాల్ స్పందిస్తూ.. జితేంద్రను వెంటనే అరెస్ట్‌ చేయాలని పోలీసులకు సూచించారు.

ఇది కూడా చదవండి: ‘నేను ఏం చేస్తానో తెలుసా?’ ఎంపీ కూతురి సమాధానంతో..

మరిన్ని వార్తలు