Assembly Election Results: ‘జై శ్రీరాం’ నినాదాలతో కాంగ్రెస్‌ సంబరాలు

3 Dec, 2023 10:29 IST|Sakshi

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో 230 సీట్లు, రాజస్థాన్‌లో 199 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లు, తెలంగాణలో 119 సీట్లలో ఎవరు విజయం సాధించనున్నారో నేడు తేలిపోనుంది. ఇదిలావుండగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడకముందే కాంగ్రెస్ పంథా మారిపోయింది. 

కాంగ్రెస్ ఇప్పుడు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు మొదలుపెట్టింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు ముందు, కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల హనుమంతుని వేషధారణలో కనిపించారు. వారంతా ‘జై శ్రీరామ్’ అంటూ  పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హనుమంతుని వేషధారణలో ఉన్న ఓ కాంగ్రెస్ కార్యకర్త ‘సత్యం మాత్రమే గెలుస్తుంది, జై శ్రీరామ్’ అంటూ  నినదించాడు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు డప్పులు వాయిస్తూ, పటాకులు పేలుస్తున్నారు. ఒక కార్యకర్త కృష్ణుని వేషధారణతో అక్కడికి వచ్చాడు. కొందరు కార్యకర్తలు రామరాజ్యం పోస్టర్లు  అతికించారు. 

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో లడ్డూలను సిద్ధం చేశారు. కార్యాలయం వెలుపల పార్టీ మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఆధిక్యం చూపాయి. రాజస్థాన్‌లో ఈసారి అధికారం మారవచ్చని కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో అంచనాలు వెలువడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: అది కింగ్‌మేకర్‌ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం?
 

మరిన్ని వార్తలు