Madhyapradesh: అది కింగ్‌మేకర్‌ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం?

3 Dec, 2023 08:19 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవారికి ‘మాల్వా-నిమాడ్‌’ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ఈ ప్రాంతం ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని చెబుతుంటారు. మాల్వా-నిమాడ్‌ ప్రాంతంలోని 15 జిల్లాల్లో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత మాల్వా-నిమాడ్‌ మధ్యప్రదేశ్‌లో కింగ్‌మేకర్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగురవేసిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాల్వా-నిమాడ్‌ ప్రాంతం కీలకంగా కనిపించింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మాల్వా-నిమాడ్‌లో విజయం సాధించడమే ప్రధాన కారణమంటారు. ఇక్కడి 35 స్థానాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 28 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భోపాల్ సింహాసనాన్ని అధిష్టించేందుకు కాంగ్రెస్‌కు మాల్వా-నిమాడ్‌ విజయం ఎంతగానో సహాయపడింది.

2013 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే మాల్వా-నిమాడ్‌లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని ప్రకంపనలు సృష్టించింది. నాడు కాంగ్రెస్‌ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. మాల్వా-నిమాడ్‌ సీట్లలో విజయం సాధించిన కారణంగా 2013లో బీజేపీ ప్రభుత్వం, 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే ఈసారి కూడా ఈ ప్రాంతంపై రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి.
ఇది కూడా చదవండి: అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం!

మరిన్ని వార్తలు