Omicron Live Updates: దేశం ఓ మైలు రాయిని అధిగమించింది! 60% జనాభాకు..

23 Dec, 2021 16:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా ఓ మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన జనాభాలో దాదాపు 60 శాతానికిపైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తిచేసినట్లు ఈరోజు మంత్రి మన్సుఖ్‌ మాండావియా సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

దేశంలోని వయోజన జనాభాలో 89 శాతం మంది ఫస్ట్‌ డోస్‌ వాక్సిన్‌ వేయించుకున్నారని ఆయన తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదుచేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 70,17,671 డోసుల వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు అందించడం ద్వారా, ఇప్పటివరకు 139.70 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కాగా గడచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 6,960 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ఐతే, దేశంలో ఇప్పటివరకు 236 ఒమిక్రాన్ కేసులు కూడా వెలుగులోకిరాగా, వీరిలో 104 మంది రోగులు కోలుకున్నారు. ఇంతవరకూ ఒక్క ఒమిక్రాన్‌ మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తవేరియంట్‌ ఉధృతి కొనసాగుతోందని ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. 

చదవండి: నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో!

మరిన్ని వార్తలు