సెంట్రల్‌ విస్టా 60 శాతం పూర్తి

3 Dec, 2021 05:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల చివరికల్లా పూర్తికావాల్సిన ఢిల్లీలోని సెంట్రల్‌ విస్టా అవెన్యూ ప్రాజెక్ట్‌లో 60 శాతం పనులు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. వచ్చే ఏడాది అక్టోబర్‌కల్లా పూర్తికావాల్సిన కొత్త పార్లమెంట్‌ భవంతి పనులు 35 శాతం పూర్తయినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర భవనాలు, పట్టణాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ గురువారం లోక్‌సభలో చెప్పారు. సెంట్రల్‌ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంట్, కేంద్ర సచివాలయం, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉపరాష్ట్రపతి నివాసం నిర్మిస్తారు.  పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,289 కోట్లు కేటాయించినట్లు కౌశల్‌ చెప్పారు.

‘న్యాయవ్యవస్థ’పై 1,622 ఫిర్యాదులు
గత ఐదేళ్ల కాలంలో హైకోర్టు జడ్జీలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలపై, న్యాయస్థానాల్లో అవినీతి ఘటనలపై 1,622 ఫిర్యాదులు అందినట్లు కేంద్రం వెల్లడించింది. ఆయా ఫిర్యాదులు కేంద్రీకృత ప్రజా ఫిర్యాదులు, పర్యవేక్షణా వ్యవస్థ(సీపీజీఆర్‌ఏఎంఎస్‌)లో నమోదయ్యాయని ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు గురువారం రాజ్యసభలో చెప్పారు. హైకోర్టు జడ్జీలపై వచ్చిన ఫిర్యాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చెంతకొస్తాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలపై ఇచ్చిన ఫిర్యాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకొస్తాయి. ఫిర్యాదులను ‘అంతర్గత విచారణ’లో విచారిస్తారు.

తొమ్మిదిన్నర రోజులకు సరిపడా బొగ్గు..
దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్‌ నెలలో బొగ్గు నిల్వలు కాస్త మెరుగుపడ్డాయి. కానీ, ఆ నిల్వలు కేవలం తొమ్మిదిన్నర రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత రెండు నెలలతో పోలిస్తే నవంబర్‌లో 18.95 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ లోక్‌సభలో గురువారం చెప్పారు.

ఇవే కేంద్రాల వద్ద సెప్టెంబర్‌లో 10.37 మిలియన్‌ టన్నుల నిల్వలుండగా అక్టోబర్‌లో కేవలం 8.07 మిలియన్‌ టన్నుల నిల్వలే ఉన్నాయి. దేశంలోనే 136 బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్‌లో మొత్తంగా 18.958 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇవి తొమ్మిదిన్నర రోజులకే సరిపోతాయి. వాస్తవానికి ప్రతీ ఏటా ఫిబ్రవరి–జూన్‌ కాలానికి బొగ్గు గనుల దగ్గర్లోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల వద్ద 17 రోజులకు సరిపడా నిల్వలు, బొగ్గు గనులకు సుదూరంగా ఉన్న విద్యుత్‌ కేంద్రాల్లో 26 రోజులకు సరిపడా నిల్వలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం తాజాగా నిబంధనలను సవరించింది.

మరిన్ని వార్తలు