అదానీపై దాచేదేమీ లేదు

15 Feb, 2023 05:50 IST|Sakshi

భయపడాల్సిన పనీ లేదు: అమిత్‌ షా  

అగర్తల(త్రిపుర): పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ నివేదిక రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తొలిసారిగా పెదవి విప్పారు. అదానీ అంశంలో తాము భయపడుతున్నది కానీ, దాస్తున్నది కానీ ఏమీ లేదన్నారు. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రిగా తానిప్పుడేమీ మాట్లాడకూడదని మంగళవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో అన్నారు.

బీజేపీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ హయాంలోనే రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుందని ఎవరైనా భావిస్తే కోర్టులను ఆశ్రయించాలన్నారు. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. మోదీపై కుట్రలు జరిగిన ప్రతీసారి ఆయన మరింత బలం పుంజుకుని ప్రజాదరణ పొందుతున్నారన్నారు

మరి భయమెందుకు?: కాంగ్రెస్‌
అదానీ ఉదంతంలో దాయటానికేమీ లేకుంటే కేంద్రం ఎందుకు భయపడుతోందని, జేసీసీ విచారణకు ఆదేశించకుండా ఎందుకు పారిపోతోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. ఈ అవకతవకలు కేంద్రాన్నే వేలెత్తి చూపుతున్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు