రేపు ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం

1 Sep, 2023 02:19 IST|Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ‘ఇస్రో’ శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. 

గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్‌ బిందువు–1(ఎల్‌–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది.  

ఇది కూడా చదవండి: మోదీ సర్కార్‌ బిగ్‌ ప్లాన్‌.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు?

మరిన్ని వార్తలు