ఐపీఎల్‌ టికెట్లు ప్లీజ్‌..తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల విన్నపం.. మంత్రి కౌంటర్‌

12 Apr, 2023 11:12 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఐపీఎల్ టికెట్లపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద పంచాయతే జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే విప్‌ ఎస్పీ వేలుమణి ఓ ఆసక్తికర అంశాన్ని మంగళవారం తెర మీదకు తెచ్చారు. క్రీడల శాఖకు సంబంధించి చేపట్టిన చర్చలో ఆయన ఐపీఎల్‌ టికెట్లు ఇప్పించాలని సదరు మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ను కోరారు.

పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఇది వరకు ఎమ్మెల్యేలు అందరికీ ఐపీఎల్‌ టికెట్లు కొని ఇచ్చామని ప్రస్తావించారు. ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసేందుకు ప్రభుత్వం టికెట్లు కొని ఎమ్మెల్యేకు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఘాటుగా స్పందించారు.

ఐపీఎల్ నిర్వహించేది మీ మిత్రుడైన కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జైషానే అని, మేమే అడిగితే మాకు ఇవ్వరు, మీరు అడిగితే ఇస్తారంటూ చురకలు అంటించారు. అంతేగాక చెన్నైలో గత నాలుగేళ్లుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లే జరగనప్పుడు, టికెట్లు కొని ఎవరికి ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులు కంగుతిన్నారు. అధికారపక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.  
చదవండి: చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుని బ్యాన్‌ చేయాల్సిందే.. !

మరిన్ని వార్తలు