ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?

16 Sep, 2023 11:32 IST|Sakshi

మీరు ప్రయాణాలను ఇష్ట‍పడేవారైతే అన్ని నగరాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. పలు నగరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి కేవలం ఒక రోజు రాజధానిగా ఉన్న ఒక నగరం ఉందని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశానికి ఒక్కరోజు కోసం ఏ నగరాన్ని రాజధానిగా చేశారో.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
 
అలహాబాద్ చరిత్ర
ఇప్పుడు మన అలహాబాద్ సంగమ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలొని వివరాల ప్రకారం మొఘల్ పాలకుడు అక్బర్ ఈ నగరానికి అలహాబాద్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ‘అల్లా నగరం’. తర్వాత అది అలహాబాద్‌గా మారింది. మొఘల్ పాలనలో ఈ నగరం ప్రాంతీయ రాజధానిగా ఉండేది. మొఘల్ పాలకుడు జహంగీర్ 1599 నుండి 1604 వరకు నగరంలో తన ప్రధాన పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
 
ఒక్క రోజు రాజధాని
మొఘలులు పతనం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పుడు అలహాబాద్ ఒక రోజు రాజధానిగా ఉంది. 1772 నుంచి కలకత్తా రాజధానిగా మనదేశాన్ని ఈస్ట్​ ఇండియా కంపెనీ పాలించింది. కాగా 1857లో మీరట్​ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనినే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెబుతుంటారు. దీనిని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్​ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్​ ప్రభుత్వం తీసుకోవాలని భావించింది. దీనిపై 1858లో క్వీన్​ విక్టోరియా ఆర్డర్స్‌ కలిగిన లెటర్​ అప్పటి వైస్రాయ్​​ జనరల్​ లార్డ్​ క్యానింగ్‌కు చేరింది. ఆ సమయంలో ఆయన  అలహాబాద్‌లో ఉన్నారు. ఆయన వెంటనే అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో సమావేశం ఏర్పాటుచేశారు. క్వీన్​ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్​ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్​ గవర్నమెంట్‌కు ట్రాన్స్​ఫర్​ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్‌ను ఇండియాకు రాజధానిగా ప్రకటించారు.  ఈ విధంగా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్​ చరిత్రలో నిలిచింది. 
 
పర్యాటక కేంద్రంగా..
ప్రయాగ్‌రాజ్ చాలా కాలం పాటు పరిపాలన, విద్యా కేంద్రంగా ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో, చుట్టుపక్కల అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మూడు పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. 

 
చూడవలసిన ప్రదేశాలు
మీరు ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నట్లయితే సంగమ స్థలితోపాటు ఖుస్రో బాగ్‌ సందర్శించవచ్చు. ఇక్కడి మొఘల్ వాస్తుశిల్పం అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఆనంద్ భవన్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పండిట్ నెహ్రూ కుటుంబానికి చెందిన భవనం. 1970లో నాటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ భవనాన్ని ఆనంద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో అక్బర్ కోట కూడా సందర్శించదగిన ప్రదేశంగా నిలిచింది. 
ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?

మరిన్ని వార్తలు