CPR: ఒకేసారి 20 లక్షల మందికి సీపీఆర్‌ నేర్పిస్తే..

6 Dec, 2023 20:12 IST|Sakshi

ఢిల్లీ: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చి ఎక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఈ రెండు మూడేళ్ల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ, సీపీఆర్‌ Cardiopulmonary resuscitation (CPR) చేసి బతికిస్తున్న ఘటనలు మాత్రం అరుదుగా చూస్తున్నాం. గణాంకాల్లో పాతికేళ్లలోపు వాళ్లు కూడా ఉంటుండగా.. ఒబెసిటీ లాంటి సమస్యలు లేనివాళ్లు కూడా సడన్‌గా చనిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే ఆపద సమయంలో రక్షించే.. సీపీఆర్‌పై దేశవ్యాప్త అవగాహన కోసం కేంద్రం నడుం బిగించింది.  

గుండెపోటు హఠాన్మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక కార్యక్రమం నిర్వహించింది.  సీపీఆర్‌పై చదువుకున్న వాళ్లకూ అవగాహన లేదని భావిస్తున్న కేంద్రం..   సీపీఆర్‌ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో 20  లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్షుఖ్‌ మాండవీయ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. సీపీఆర్‌ టెక్నిక్‌పై శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. 

అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ తరహా హఠాన్మరణాలు 12.5 శాతం పెరిగాయి. మంచి ఆహారం తీసుకోవాలని, అయినా ఈ తరహా మరణాలు సంభవిస్తుండడంతో సీపీఆర్‌పైనా అవగాహన ఉండాలని అన్నారాయన.  కొవిడ్‌-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనాన్ని ఉదహరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. దాదాపు రెండు లక్షల మంది టీచర్లు, కాలేజీ ఫ్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్‌ ఇస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. 

>
మరిన్ని వార్తలు