-

Amit Shah: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్‌ డోస్‌ పంపిణీ పూర్తవగానే అమలులోకి!

2 Aug, 2022 16:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కోవిడ్‌-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్‌లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ‘కోవిడ్‌-19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్‌ షా చెప్పారు.’ అని పేర్కొన్నారు అధికారి. 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బుస్టర్‌ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్‌ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. 

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్‌ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే.. 2014, డిసెంబర్‌ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్‌లో ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్‌లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: భవిష్యత్‌లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు