-

కాంగ్రెస్‌ అమ్ముడుపోయే పార్టీ 

27 Nov, 2023 03:59 IST|Sakshi

అది బీఆర్‌ఎస్‌ను బీ టీమ్‌లా కాపాడుతోంది 

మక్తల్, ములుగు, భువనగిరి సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

మేం అధికారంలోకి వస్తే బీసీ సీఎం.. ఎస్సీ వర్గీకరణ చేస్తాం 

గిరిజనేతరులకూ పోడు పట్టాలు

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే అభివృద్ధి అని వ్యాఖ్య 

సాక్షి, యాదాద్రి/నారాయణపేట/ములుగు:  కాంగ్రెస్‌ అంటేనే అమ్ముడుపోయే పార్టీ అని, అది తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను బీ టీమ్‌లా కాపాడుతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టేనని, ఆ రెండింటికీ చెక్‌పెట్టి బీజేపీని గెలిపించాలని కోరారు. మూసీ నదిలా తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్‌ అవినీతితో కలుషితం చేశారని.. ఈ అవినీతి కాలుష్యాన్ని శుద్ధి చేయాలంటే బీజేపీకి అధికారం అప్పగించాలని పేర్కొన్నారు.

ఆదివారం మక్తల్, ములుగు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా మాట్లాడారు. నారాయణపేట సభలో కురుమూర్తిస్వామి, జోగుళాంబదేవి, సంగమేశ్వరస్వామికి.. ములుగు సభలో సమ్మక్క–సారలమ్మ, రామలింగేశ్వరస్వామికి నమస్కరిస్తున్నా అంటూ అమిత్‌ షా తన ప్రసంగాలను ప్రారంభించారు. 

వివరాలు ఆయన మాటల్లోనే.. 
‘‘ఇవి తెలంగాణ భవిష్యత్‌ కోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి. కేసీఆర్‌ సర్కారు గత పదేళ్లలో అవినీతిలో కూరుకుపోయింది. కుంభకోణాల మయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో, మియాపూర్‌ భూముల్లో వేల కోట్లు దోచుకున్నారు.

బీఆర్‌ఎస్‌ వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్‌ భూకబ్జాల కారును గ్యారేజీకి పంపిస్తాం. కేసీఆర్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేసీఆర్‌ అబద్ధాలు చెప్తున్నారు. అసలు కేసీఆర్‌ జాతీయ హోదా కోసం ఒక్కనాడు కూడా ప్రధాని మోదీని కలవలేదు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య డీల్‌.. 
కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు బీఆర్‌ఎస్‌కు వేసినట్లే. వారిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే. కాంగ్రెస్‌ అమ్ముడు పోయే పార్టీ. అది బీఆర్‌ఎస్‌ను బీ టీంలా కాపాడుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో వారి మధ్య అధికారాన్ని పంచుకునే డీల్‌ కుదిరింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎలాగూ అధికారంలోకి రాదు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారు. బీఆర్‌ఎస్‌ రాబోయే రోజుల్లో  కేంద్రంలో రాహుల్‌గాందీని ప్రధాన మంత్రిని చేయాలనేది ఒప్పందం. 

పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం 
తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ చేపడతాం. పెట్రోల్,  డీజిల్‌ ధరలు తగ్గిస్తాం. కేసీఆర్‌ రజాకార్ల పార్టీ  ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. మేం అధికారంలోకి రాగానే సెపె్టంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తాం. బీఆర్‌ఎస్‌ ఇస్తున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంచుతాం. మేం అధికారంలోకి రాగానే గిరిజనేతరులకు సైతం ఆంక్షలు లేని పోడుపట్టాలు జారీ చేస్తాం. గిరిజన రైతులకు రూ.12 వేల చొప్పున అందజేస్తాం. 

అయోధ్యలో రాముడి దర్శనం చేయిస్తాం 
భవ్యమైన, దివ్యమైన అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఉచితంగా అయోధ్య ప్రయాణం, వసతి, దర్శనం కల్పిస్తాం..’’అని అమిత్‌ షా ప్రకటించారు. 

'డబుల్‌ ఇంజన్‌’తో రాష్ట్రం నంబర్‌వన్‌ 
రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుందాం. దేశాన్ని సురక్షితంగా అభివృద్ధిపథంలో నడిపిస్తున్న మోదీని 2024లో మరోసారి ప్రధాని చేసుకుందాం. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో తెలంగాణను నంబర్‌వన్‌గా అభివృద్ధి చేసుకుందాం. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. 

మరిన్ని వార్తలు