ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం.. మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన

5 Jan, 2023 20:45 IST|Sakshi

న్యూడిల్లీ: న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. గత ఏడాది నవంబర్‌ 26న జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణం మరవకముందే అదే ఎయిర్‌ ఇండియా విమానంలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.  పారిస్‌- ఢిల్లీ విమానంలో తాగిన మత్తులో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విజర్జన చేశాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన డిసెంబర్‌ 6న ఎయిర్‌ ఇండియా విమానం 142లో చోటుచేసుకుంది.

విమానం ఉదయం 9.40 గంటలకు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వడంతో ఈ విషయంపై పైలెట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ప్రయాణికుడు మద్యం సేవించి ఉండటం వల్ల క్యాబిన్‌ సిబ్బంది సూచలను పాటించలేదని అతడు పేర్కొన్నారు. అనంతరం అతను  తోటి మహిళా ప్యాసింజర్ దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడని తెలిపారు.

విమానం దిగిన వెంటనే ఈ నీచానికి పాల్పడిన వ్యక్తిని ఎయిర్‌ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన అసభ్య ప్రవర్తనపై ప్రయాణికుడు రాతపూర్వక క్షమాపణ తెలిపాడు. దీంతో ఇద్దరుప్రయాణికులు పరస్పర రాజీ కుదుర్చుకోవడంతో అతనిపై చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇంతకుముందు అమెరికాలోని న్యూయర్క్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంలో  మద్యం మత్తులో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు.. సీట్లో కూర్చున్న ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానంలో తనకు జరిగిన అవమానంపై బాధితురాలు ఎయిర్‌ ఇండియా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అధికారులు ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వృద్ధుడిపై కేసు నమోదయ్యింది.  అయితే విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయిన తర్వాత నిందితుడిని ఎయిర్‌ ఇండియా సిబ్బంది పట్టుకోకుండా వదిలేశారని బాధితురాలు ఆరోపించింది.

ఆమెకు న్యాయం చేకూర్చేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఎయిర్‌ ఇండియా నుంచి పూర్తి నివేదిక కోరామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) స్పష్టం చేసింది. నిందితుడి కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారుల బుధవారం  తెలియజేశారు.    

మరిన్ని వార్తలు