దేశానికి బలమైన ప్రధాని వద్దు.. బలహీన పీఎం అవసరం: ఒవైసీ

10 Sep, 2022 20:10 IST|Sakshi

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు బలమైన ప్రధాని వద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరాలంటే దేశంలో బలహీన ప్రధాని అవసరం అన్నారు. ఈసారి బ‌ల‌హీనుల‌కు ల‌బ్ధి చేకూర్చే బ‌ల‌హీన ప్ర‌ధాని దేశానికి అవ‌స‌ర‌మ‌ని తాను భావిస్తున్నాన‌ని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. బ‌ల‌హీన ప్ర‌ధాని పగ్గాలు చేప‌డితే బ‌ల‌హీన‌వ‌ర్గాలు లాభ‌ప‌డ‌తాయ‌ని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. బ‌ల‌మైన‌ ప్ర‌ధాని కేవ‌లం ధనవంతులకు(సంపన్న వర్గాలకే) సాయ‌ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఇప్పటి వరకు మనం బ‌ల‌మైన ప్ర‌ధానిని చూశాము.. ఇక వచ్చే ఎన్నికల్లో పేదలకే మేలు చేసే ప్రధానిని ఎన్నుకోవాలన్నారు. కాగా, 2024 ఎన్నికల్లో తాము ఈ దిశ‌గా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి 306 మంది ఎంపీలున్నా.. వ్యవస్థను నిందిస్తున్నారని అన్నారు. పేద‌లు, రైతులు, యువ‌త‌కు మేలు చేసేందుకు ఆయ‌న‌కు ఇంకా ఏం అధికారాలు కావాల‌ని ప్ర‌శ్నించారు. 

దేశంలో జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రధాని అయిన నరేంద్ర మోదీ.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చైనా చొరబాటు, కార్పొరేట్ ట్యాక్స్ ర‌ద్దు వంటి ప్ర‌శ్నలు ఎదురైతే ప్ర‌ధాని వ్య‌వ‌స్ధ‌ను నిందిస్తుంటార‌ని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగానే ఒవైసీ.. ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపైన సైతం విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో జరిగిన బిల్కిన్‌ బానో కేసు విషయంలో ఖైదీల విడుదలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎందుకు స్పందించలేదన్నారు. ఆప్‌ కూడా బీజేపీ వంటిదేనని.. రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. 

మరిన్ని వార్తలు