‘శశిథరూర్‌కు కష్టమే.. మల్లికార్జున ఖర్గేనే గెలుస్తారు’.. గెహ్లాట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

2 Oct, 2022 15:10 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, ఎంపీ శశిథరూర్‌ నిలిచారు. దీంతో, పోటీలో ఎవరు విజయం సాధిస్తారన్నదనిపై చర్చ నడుస్తోంది. ఇక, కాంగ్రెస్‌ అధ్యక్ష రేసు నుంచి రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తప్పుకున్న విషయం తెలిసిందే.

కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అశోక్‌ గెహ్లాట్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. గెహ్లాట్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గెహ్లాట్‌.. కాంగ్రెస్‌ పార్టీని మల్లికార్జున ఖర్గే బలోపేతం చేస్తారని అన్నారు. తన మద్దతు ఖర్గేకే అని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం, అధ్యక్ష బరిలో ఉన్న శశిథరూర్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. శశిథరూర్‌ ఉన్నత వర్గానికి చెందిన నేత అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అలాగే, ఖర్గేను మాత్రం ప్రశంసించారు. మలికార్జున ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన నేత అన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం ఖర్గేకు ఉందన్నారు. ఈ విషయంలో థరూర్‌ను ఖర్గేతో పోల్చలేమని కుండబద్దలుకొట్టారు. కాబట్టి.. పోటీ ఏకపక్షంగా ఖర్గేకే మద్దతు ఉంటుందని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు