స్వతంత్ర భారత గణతంత్ర సారథులు

14 Aug, 2022 14:27 IST|Sakshi
పైవరుస : రామ్‌నాథ్‌ కోవింద్, ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, అబ్దుల్‌ కలామ్, కె.ఆర్‌.నారాయణ్, శంకర్‌ దయాళ్‌ Ô¶ ర్మ, ఆర్‌. వెంకటరామన్‌; కింది వరుస : జ్ఞానీ జైల్‌సింగ్, నీలం సంజీవరెడ్డి, ఫకృద్దీన్‌ అలీ అహ్మద్, వి.వి.గిరి, జకీర్‌ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబూ రాజేంద్ర ప్రసాద్‌.

భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతి. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. కొన్ని సందర్భాలలో, కొందరు రాష్ట్రపతులు ప్రధానితో విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ విషయంలోనే ఇది రుజువైంది. ఒక బలమైన ప్రధానితోనే ఆయన తన మనోగతాన్ని వ్యక్తీకరించడానికి వెనుకాడలేదు. తరువాత కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి.
చదవండి: జెండా ఊంఛా రహే హమారా! 

రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ కొన్ని బిల్లులను వెనక్కి తిప్పి పంపారు.అందులో తపాలా బిల్లు ఒకటి. వాస్తవానికి కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన ఏ అంశాన్నయినా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తరువాత నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు!

స్వాతంత్య్ర సమరయోధులు, ప్రపంచ ప్రఖ్యాత విద్యావంతులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు, న్యాయ నిపుణులు రాష్ట్రపతి పదవిని అలంకరించారు. జూలైలో పదవీ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతి. 1950లో భారత్‌ గణతంత్ర దేశమైన తరువాత ఆ పదవిలోకి వచ్చిన 15 మందిలో ఎనిమిది మంది రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారే. వారిలో ఆరుగురు కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచినవారు. పన్నెండు మంది ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దేశంలో అధికార పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయమే ప్రధానంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు రాష్ట్రపతులయ్యారు. వారే రామ్‌నాథ్‌ కోవింద్, ద్రౌపది ముర్ము.  

స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌. ఆయన అధ్యాపకుడు, న్యాయవాది. గాంధేయవాది. నెహ్రూతో సమంగా గాంధీజీతో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. రెండవసారి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైన రాజనీతిజ్ఞుడు రాజెన్‌ బాబు. ప్రథమ ప్రధాని వలెనే, తొలి రాష్ట్రపతి రాజేన్‌ బాబు కూడా పన్నెండేళ్ల నూట ఏడు రోజులు ఉన్నారు. ఇప్పటి వరకు అదే రికార్డు. హిందూ కోడ్‌ బిల్లు విషయంలో నెహ్రూతో విభేదించారు. సోవ్‌ునాథ్‌ ఆలయం ప్రతిష్టకు తాను హాజరు కావడంపై నెహ్రూ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు.

రెండవ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌.ఆయన తత్త్వశాస్త్ర వ్యాఖ్యాత. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు. యునెస్కోకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. మూడవ రాష్ట్రపతి డాక్టర్‌ జకీర్‌ హుస్సేన్‌. ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం. అలీగఢ్‌ విశ్వవిద్యాలయం చాన్సలర్‌గా పనిచేశారు. ఆయన పదవిలో ఉండగానే కన్నుమూశారు.

నాల్గవ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి.  కార్మికోద్యమం నుంచి వచ్చారు. ఈయన ఎన్నిక వివాదాస్పదమైన మాట నిజమే. కాంగ్రెస్‌ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని నాటి ప్రధాని ఇందిర కూడా పార్టీ సమావేశంలో ఆమోదించారు. కానీ తరువాత వీవీ గిరిని అభ్యర్థిగా నిలిపారు. పార్టీ అభ్యర్థి నీలం ఓడిపోయారు. గిరి విజయం సాధించారు.

ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌. జకీర్‌ హుస్సేన్‌ మాదిరిగానే ఈయన కూడా పదవిలో ఉండగానే చనిపోయారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశం అత్యవసర పరిస్థితి విధింపు. ఆ ఆదేశాల మీద మారు మాట లేకుండా అర్ధరాత్రి సంతకం చేసి పంపిన రాష్ట్రపతిగా ఈయన  గుర్తుండిపోయారు. 
ఆరో రాష్ట్రపతి డాక్టర్‌ నీలం సంజీవరెడ్డి. దేశ చరిత్రలో ఏకగీవ్రంగా ఎన్నికైన రాష్ట్రపతి. తెలుగువారు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక తరువాత దాదాపు అజ్ఞాతం లోకి వెళ్లిన నీలం సంజీవరెడ్డి జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్‌ నుంచి గెలుపొందారు. 42 లోక్‌సభ స్థానాలకు గాను, 41 కాంగ్రెస్‌ గెలుచుకుంది. నంద్యాల స్థానం మాత్రం జనతా పార్టీ గెలిచింది. ఆ గెలుపు నీలం సంజీవరెడ్డిది.

ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌. సిక్కు వర్గం నుంచి ఎన్నికైన తొలి రాష్ట్రపతి. స్వర్ణాలయం మీద ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సైనిక చర్య, ఇందిరా గాంధీ హత్య, వెంటనే దేశవ్యాప్తంగా సిక్కుల మీద హత్యాకాండ ఆయన రాష్ట్రపతిగా ఉండగానే జరిగాయి. ఎనిమిదో రాష్ట్రపతి ఆర్‌.వెంకటరామన్‌. ఈయన కూడా స్వాతంత్య్ర పోరాట యోధుల తరానికి చెందినవారే. తామ్రపత్ర గ్రహీత కూడా. కె. కామరాజ్‌ నాడార్‌ మీద ఆయన రాసిన పుస్తకానికి గాను సోవియెట్‌ రష్యా సోవియెట్‌ ల్యాండ్‌ పురస్కారం ఇచ్చింది. తొమ్మిదో రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌దయాళ్‌ శర్మ. గొప్ప న్యాయ నిపుణుడు. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలకు ఇంటర్నేషనల్‌ బార్‌ అసోసియేషన్‌ ‘లివింగ్‌ లెజెండ్‌ ఆఫ్‌ లా అవార్డ్‌ ఆఫ్‌ రికగ్నిషన్‌’ బహూకరించింది.

పదవ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌. దళిత వర్గం నుంచి తొలిసారిగా ఆ పదవిని అధిరోహించిన వారు. రాష్ట్రపతి అయిన తొలి మలయాళి. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ సంస్థలో విద్యాభ్యాసం చేశారు. 1980–1984 మధ్య అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. పదకొండవ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం. రాజకీయాలలో సంబంధం లేని వ్యక్తి. రోహిణి ఉపగ్రహాలు, అగ్ని, పృథ్వి క్షిపణులు ఆయన పర్యవేక్షణలోనే విజయవంతంగా ప్రయోగించారు. మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా ఖ్యాతి గడించారు. అలాగే పోటీ చేసిన గెలిచిన రాష్ట్రపతులందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించినవారు కలాం. అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో 1998లో జరిపిన రెండో పోఖ్రాన్‌ అణు పరీక్షలో కలాం కీలకపాత్ర వహించారు.

పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభాసింగ్‌ పాటిల్‌. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ. సుఖోయి విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. పదమూడవ రాష్ట్రపతి డాక్టర్‌ ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ. పద్నాల్గవ రాష్ట్రపతి రావ్‌ునాథ్‌ కోవింద్‌. పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ పదవిని అలంకరించిన తొలి ఆదివాసీ మహిళ. వీవీ గిరి (1969), హిదయ్‌తుల్లా (1969), బసప్ప దాసప్ప జెట్టి (1977) తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. అప్పుడు వీరు ఉపరాష్ట్రపతులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.    
– డా. గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’ 

మరిన్ని వార్తలు