మహోజ్వల భారతి: నంబర్‌ 1 స్టూడెంట్‌ 

12 Aug, 2022 13:39 IST|Sakshi
తల్లి కల్పకంతో సీతారాం ఏచూరి (ఫైల్‌ ఫొటో)

సీతారాం ఏచూరి కమ్యూనిస్టు నాయకుడు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కిస్టు) ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. నేడు ఆయన జన్మదినం. ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా ఢిల్లీ లోనే సాగింది. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో బీఏ (ఆనర్స్‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు.

1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీహెచ్‌.డీ లో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. 1974లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యుడిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఉన్నారు.

చదవండి: (మహోజ్వల భారతి: చిరునవ్వుతో ఉరికంబానికి!)

ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. 2015 మార్చి 3 న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది.

రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం చాలా అరుదు. ఇది సహజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. సీతారాం తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌ కందా మేనల్లుడు. ఏచూరి తల్లి కల్పకం, మోహన్‌ కందా సోదరి, ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ శిష్యురాలు. గత ఏడాదే ఆమె కన్నుమూశారు. ఏచూరి భార్య సీమా చిస్తీ జర్నలిస్టు. ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు. 

మరిన్ని వార్తలు