30న బాబ్రీ కూల్చివేత తీర్పు

17 Sep, 2020 06:04 IST|Sakshi

అడ్వాణీ సహా నిందితులందరూ హాజరుకావాలని కోర్టు ఆదేశం

28 ఏళ్లకు వెలువడనున్న తీర్పు

లక్నో: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. కూల్చివేత ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక తీర్పు రాబోతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషి సహా 32 మంది అభియోగాలు ఎదుర్కొంటూ ఉండడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌కే యాదవ్‌ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ న్యాయస్థానానికి హాజరు కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమా భారతి, కళ్యాణ్‌ సింగ్, వినయ్‌ కటియార్, స్వాధి రితంబర వంటి బీజేపీ సీనియర్‌ నాయకులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న బాబ్రీ కేసులో ఈ నెల 1న వాదనలు పూర్తయ్యాయి.

351 సాక్షులు, 600 డాక్యుమెంట్లు
బాబ్రీ కేసుని విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగు తుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ వాదనలు వినిపించింది.  1992 డిసెంబర్‌ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు