అది సభా హక్కుల ఉల్లంఘనే

18 Nov, 2021 05:36 IST|Sakshi

తృణమూల్‌ ఎమ్మెల్యేల అరెస్ట్‌ ముందుగా చెప్పలేదు

బెంగాల్‌ అసెంబ్లీలో ఇద్దరు సీబీఐ, ఈడీ అధికారులపై హక్కుల తీర్మానం

కోల్‌కతా: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీఐబీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో బుధవారం అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేసేటప్పుడు ముందస్తుగా సమాచారం అందివ్వలేదని అది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ తీర్మానం పేర్కొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ మంత్రి తపస్‌ రాయ్‌ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

నారద స్టింగ్‌ ఆపరేషన్‌ కేసుకి సంబంధించి ఈ ఏడాది మొదట్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు  ఫిరాద్‌ హకీమ్, మదన్‌ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారని, వారిని అరెస్ట్‌ చేయడానికి ముందు స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ అనుమతి తీసుకోలేదని, ఆయనకు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందివ్వలేదని తపస్‌ రాయ్‌ చెప్పారు. ఈడీ కూడా వారి ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిందని వెల్లడించారు. సీబీఐ, ఈడీ సభా హక్కుల్ని ఉల్లంఘించారని, స్పీకర్‌కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్‌పీ సత్యేంద్ర సింగ్, ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రతిన్‌ బిశ్వాస్‌పై సభా హక్కుల ఉల్లంఘనను ప్రవేశపెడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ అంశాన్ని స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు.  వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు