Bengaluru Rains: బెంగళూరును వణికిస్తున్న భారీ వర్షాలు

6 Sep, 2022 10:46 IST|Sakshi
బెంగళూరు సమీపంలోని రెయిన్‌బో డ్రైవ్‌ లేఅవుట్‌లో నీట మునిగిన కారును బయటకు లాగుతున్న దృశ్యం

నగరాన్ని వణికించిన భారీ వర్షాలు  

రోడ్లపై వరద.. స్తంభించిన ట్రాఫిక్‌

బెంగళూరు/బనశంకరి: భారీ వర్షాల ధాటికి బెంగళూరు చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం ఐదింటి దాకా  13 సెంటీమీటర్ల మేర కుండపోతగా కురిసిన వర్షాలతో అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. సహాయక చర్యల కోసం ప్రభుత్వ అధికారులు పడవలు, ట్రాక్టర్లను రంగంలోకి దించారు.

నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు పడవల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు చేరుకున్నారు. అపార్టుమెంట్లు, భారీ భవనాల బేస్‌మెంట్లలో, ఇళ్ల ముందు పార్కు చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ప్రధానంగా వైట్‌ఫీల్డ్, ఇందిరానగర్, కాంగేరి, ఆర్‌ఆర్‌ నగర్, బొమ్మనహళ్లి, మారథాళ్లి, మహాదేవపురాలో వరదల తీవ్రత అధికంగా ఉంది.

బెల్లందూర్‌లో వర్షపునీటితో మునిగిపోయిన రహదారి

స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ  
ఐటీ కంపెనీలుండే ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతం జలమయమైంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లపై వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆస్పత్రుల్లోకి నీరు చేరింది. సహాయక చర్యల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చెప్పారు. బెంగళూరులో 48 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నీరు చేరడంతో ఎయిర్‌పోర్టు రోడ్డు మునిగిపోయింది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ప్రయాణికులు మోకాలి నీటి లోతులో నడుస్తూ వీడియోలను చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు