ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు

17 Dec, 2023 06:04 IST|Sakshi

టెకీల కోసం బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రయోగం

బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్‌ సిగ్నళ్లు, స్పీడ్‌ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్‌ రింగ్‌ రోడ్, వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది.

ట్రాఫిక్‌ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్‌ డివిజన్‌ పరిధిలోని ట్రాఫిక్‌ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు.

>
మరిన్ని వార్తలు