Karnataka Assembly Elections: ఓటీపీ రాకుంటే.. ఓటు వేసే ప్రసక్తే లేదు!

26 Feb, 2023 06:54 IST|Sakshi

యశవంతపుర(బెంగళూరు): ఇప్పుడు అందరూ ఆన్‌లైన్లో లావాదేవీలు చేయడం పరిపాటైంది. లావాదేవీల్లో ఓటీపీని ఎంటర్‌ చేశాకే పూర్తవుతుంది. కానీ తాము మొబైల్‌ టవర్లు– ఇంటర్నెట్‌ లేని కారణంగా ఓటీపీ వసతిని పొందలేకున్నామని చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా బలిగె, మెణసిన హడ్య గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున  ఓటుకు ముడిపెట్టారు.

హామీలపై నమ్మకం లేదు 
నాయకులపై నమ్మకం వద్దు, వారిచ్చే హామీలు మాకొద్దు, మా గ్రామంలో మొబైల్‌ టవర్‌ కావాలని జనం డిమాండ్‌ చేస్తున్నారు. ఓటీపీ లేకుంటే– ఓటు లేదనే నినాదంతో ఆందోళన మొదలుపెట్టారు. ఈ నినాదంతో అంతటా బ్రోచర్లను అంటించడం ఆరంభమైంది. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన పోలీసులు బలిగె, మెణసినహడ్య గ్రామాలకు మొబైల్‌ టవర్‌ను వేయలేదు.

నెట్‌ లేకుంటే ఎలా
టవర్లు వేయకుంటే, వచ్చే విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. 70 కుటుంబాలున్న గ్రామంలో 10 ఏళ్ల నుంచి మొబైల్‌ నెట్‌వర్క్‌ లేదు, ఫలితంగా ఇంటర్నెట్‌ కూడా అందని పండే అయ్యింది. ఈ డిజిటల్‌ యుగంలో ప్రభుత్వం సౌకర్యాలు కావాలన్నా మొబైల్, ఇంటర్నెట్‌ చాలా ముఖ్యమయ్యాయని గ్రామస్థులు తెలిపారు. కాగా, ఓటీపీ లేకుంటే ఓటు లేదనే అభియానతో ప్రజాప్రతినిధులలో చలనం కనపడుతోంది. ఆందోళనలను విరమించాలని గ్రామాల పెద్దలకు రాయబారాలు పంపారు. ఈ అభియాన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లు గ్రామస్థులకు మద్దతుగా సందేశాలు పెడుతున్నారు. 
చదవండి  విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?

మరిన్ని వార్తలు