బిహార్‌ తొలి దశ ఎన్నికల పోలింగ్‌

28 Oct, 2020 07:52 IST|Sakshi

పట్నా: కరోనా కాలంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్‌ శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్‌ జరుగుతోంది. ఓటు వేసేందుకు బిహారీలు ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరారు. చిన్నచిన్న అపశ్రతులు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 33.10 శాతం పోలింగ్‌ నమోదయినట్టు సమాచారం.

కరోనా సంక్షోభం నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. కోవిడ్‌ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది గూమిగూడకుండా ఒక్కో పోలింగ్‌బూత్‌కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించారు. ఈవీఎంలను తరచుగా శానిటైజ్‌ చేస్తున్నారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. 71 అసెంబ్లీ స్థానాల్లో 33 స్థానాలను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల సంఘం ప్రకటించింది.


కాగా, పోటీలో నిలిచిన అభ్యర్థులతో పాటు ప్రముఖ నాయకులు అందరూ ఆలయాలను, ప్రార్థనాలయాలను దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌.. లఖిసరాయ్‌లోని బారాహియాలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామంలో ఎన్నికలు అనేవి పండుగ లాంటివనిపేర్కొన్నారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాంకేతిక లోపాల కారణంగా షికాపురాలో పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ గయాలో ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్‌ జరుగుతున్న 71 స్థానాల్లో ఎన్డీఏ 50 చోట్ల గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

కోవిడ్‌ నిబంధనలు మరవొద్దు: ప్రధాని
ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బిహారీలకు ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఓటర్లు పరస్పరం రెండు గజాల భౌతిక దూరం పాటించాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్క్‌ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు