వరుడికి కోలుకోలేని షాక్‌: ఆరడగులు నడిచిన తర్వాత..

29 Jun, 2021 20:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: హిందూ వివాహ పద్ధతిలో సప్త పదికి ఉన్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాణి గ్రహణం తర్వాత, వధూవరులు హోమగుండం చుట్టు ప్రదక్షిణలు చేసి, ఏడడుగులు నడుస్తారు. ఆ సమయంలో చదివే మంత్రాలు, వరుడి సంకల్పాన్ని దేవతలకు ఏడు వాక్యాలలో తెలియజేస్తాయని ప్రతీతి. అలాంటి పవిత్ర కార్యం జరుగుతున్న సమయంలో ఓ పెళ్లికూతురు వరుడికి కోలుకోలేని షాకిచ్చింది. ఆరడుగులు అతడితో కలిసి నడిచిన తర్వాత.. ఈ పెళ్లిని ఆపేయాలంటూ అక్కడున్న పెద్దలను కోరింది. దీంతో.. పెళ్లికొడుకు సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతవరకు సంతోషంగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా గంభీరంగా మారిపోయింది. 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో గల కుల్‌పహడ్‌ తహసీల్‌లో చోటుచేసుకుంది. కాసేపట్లో శ్రీమతిగా మారాల్సిన వధువు.. తీసుకున్న నిర్ణయం వల్ల ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అత్యవసరంగా అర్ధరాత్రి పంచాయతీ పెద్దలు పెళ్లివేదిక వద్దకు వచ్చి ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. కాసేపు చర్చలు జరిగిన తర్వాత వధువు పెళ్లి ఆపేయాలన్న తన నిర్ణయానికే కట్టుబడి ఉంటానని తేల్చిచెప్పడంతో వరుడు, అతడి బంధువులు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ.. పెళ్లి కుమార్తెకు వరుడు నచ్చలేదట. పెద్దల కోసం అతడిని పెళ్లి చేసుకుందామనుకున్నా మనసు అందుకు అంగీకరించకపోవడంతో... చివరి నిమిషంలో.. ‘‘ఆపండి’’ అన్న ఒక్క డైలాగ్‌తో జీవితకాల నిర్బంధం నుంచి తప్పించుకుందట.

ఈ విషయంపై స్పందించిన వరుడి తండ్రి మాట్లాడుతూ... ఒకవేళ అమ్మాయికి పెళ్లి ఇష్టంలేకపోతే ​ముందే చెప్పాలి కానీ.. ఇంతదాకా వచ్చాకా ఆపడం ఏంటని మండిపడ్డారు. కాగా పెళ్లికొడుకు గుట్కా నములుతున్నాడని, కళ్లద్దాలు లేకుండా పేపర్‌ చదవలేకపోతున్నాడని, మద్యం సేవించి మండపానికి వచ్చాడన్న కారణాలతో పలువురు వధువులు మండపంలోనే పెళ్లిళ్లు ఆపేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో.. ‘‘ఇప్పటికైనా యువతులు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటూ, ముందుకు సాగడం సంతోషంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యువతుల్లో చైతన్యం రావడం హర్షించదగ్గ పరిణామమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సప్తపది ఎందుకు?
వధువు మొదటి అడుగుతో అన్నం, రెండో అడుగు వల్ల బలం, మూడో అడుగు వలన కర్మ, నాల్గవ అడుగుతో సుఖసంతోషాలు, ఐదో అడుగువలన పశుసంపద, ఆరో అడుగు వలన ఋతుసంపద, ఏడో అడుగు వలన సత్సంతానం కలగాలని వరుడు ప్రార్థిస్తాడు. తర్వాత ఆ వధువు చేత.. గృహస్థాశ్రమ ధర్మాలలో మీకు అర్ధ శరీరమై, వెన్నంటే ఉండి అన్ని బాధ్యతలు నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. ఆ తర్వాత వధువుతో తన సఖ్యతను తెలియజేసి ఆమె అంగీకారాన్ని పొందుతాడు. అలా వారిద్దరి మధ్యన ఏర్పడిన బంధం ఏడు జన్మల వరకు నిలవాలని కోరుకోవడమే సప్తపది అని పెద్దలు చెప్పిన మాట.

చదవండి: 18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్‌ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై
దారుణం: నవవధువుపై భర్త,మరుదుల సామూహిక లైంగిక దాడి

మరిన్ని వార్తలు