అమ్మాయిని ‘ఐటమ్‌’ అని పిలిచిన పోకిరి.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన కోర్టు!

26 Oct, 2022 10:27 IST|Sakshi

ముంబై: మైనర్‌ బాలికను ‘ఐటమ్‌’ అని పిలిచినందుకు ఓ యువకుడికి ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. అబ్బాయిలు లైంగిక వేధింపుల ఉద్ధేశ్యంతో మాత్రమే అమ్మాయిని ఐటమ్‌ అని కామెంట్‌ చేయడం జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్‌ను 2015లో ఓ వ్యక్తి టీజ్‌ చేసిన కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

2015 జూలై 14న విద్యార్థిని స్కూల్‌ నుంచి తిరిగి వస్తుండగా ’ఏయ్‌ ఐటమ్‌.. ఎక్కడికి వెళ్తున్నవ్‌’ అంటూ స్థానికంగా నివాసముండే 25 ఏళ్ల యువకుడు కామెంట్‌ చేశాడు. దీంతో బాలిక తనను వేధించవద్దని కోరగా.. మరింత రెచ్చిపోయిన వ్యక్తి ఆమె జుట్టుపట్టుకొని లాగి దుర్భాషలాడాడు. బైక్‌పై వెంబడించాడు. దీంతో ఆమె పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 100కు కాల్‌ చేసి జరిగింది చెప్పింది. పోలీసులు వచ్చేలోపు పోకిరి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 354, 354(డీ), 506, 504 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదైంది.

దీనిపై ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు విచారణ చేపట్టింది. అబ్బాయిలు ఉద్ధేశపూర్వకంగా అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే ఈ పదం(ఐటమ్‌) ఉపయోగిస్తారని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌జే అన్సారీ పేర్కొన్నారు. మైనర్‌ బాలికపై వేధింపుల కేసు కాబట్టి నిందితుడి విషయంలో కనికరం చూపే ప్రసక్తే లేదని తెలిపారు. అమ్మాయిని అలా అల్లడి వెనక నిందితుడి ఉద్ధేశ్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. రోడ్డు సైడ్‌ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, ఇలాంటి నేరాలను కఠినంగా శిక్షించాలని కోర్టు వ్యాఖ్యానించింది.
చదవండి: విద్యార్థులతో ఆడిపాడిన చిన్నారి.. ఉన్నట్టుండి కుప్పకూలడంతో...

మరిన్ని వార్తలు