దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తాం

10 May, 2022 10:17 IST|Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంలోని కొన్ని అంశాలపై పునఃసమీక్ష జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణకు కట్టుబడి వివిధ వర్గాల అభిప్రాయాలు, ఆందోళనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. విద్రోహ చట్టంలోని సెక్షన్‌ 124ఏ చట్టబద్ధతపై రాజ్యాంగబద్ధ అనుమతి కలిగిన సాధికార సంస్థతో పరిశీలన జరిపిస్తామని పేర్కొంది. అప్పటి వరకు, ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవద్దని కోరింది.

దేశం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ..వలస పాలన భారాన్ని తొలగించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపింది. బ్రిటిష్‌ కాలం నాటి 1,500 చట్టాలను ఇప్పటికే తొలగించినట్లు కేంద్ర హోం శాఖ సోమవారం సుప్రీంకోర్టులో మూడు పేజీల అఫిడవిట్‌ దాఖలు చేసింది. తెలిపింది. కేదార్‌నాథ్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో 1962లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ చట్టంపై మళ్లీ సమీక్ష అవసరం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం..ఇంతలోనే యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం.దేశద్రోహ చట్టం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై 10వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. 

చదవండి: (పెళ్లిలో ‘షేర్వాణీ’ రగడ)

మరిన్ని వార్తలు