పర్యాటక రంగం పరుగు!

16 Oct, 2020 06:15 IST|Sakshi

మరో ప్యాకేజీకి కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా ప్రభావం పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలపై తీవ్రంగా ఉంది. ఇప్పటికీ హోటల్స్‌లో తినాలన్నా, వేరే ఊళ్లకి వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీని రూపొందించడానికి కసరత్తు చేస్తోందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ఒక జాతీయ చానెల్‌కు వెల్లడించారు. ఈ ప్యాకేజీతో పర్యాటక రంగం పరుగులు పెట్టడమే కాకుండా పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అంతే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తున్నట్టుగా అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. అయితే ఈ ప్యాకేజీని ప్రకటించడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని ఆయన వివరించారు. ఈ పండుగ సీజన్‌లో వచ్చే ఆదాయ మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. పౌర విమానయానం, రైల్వేల నుంచి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.   సెప్టెంబర్‌లో ప్రజల కొనుగోలు శక్తి సూచి 56.8 పాయింట్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మధ్య తరగతి ప్రజలు దసరా, దీపావళి సీజన్‌లో ఎంత ఖర్చు పెడతారో చూడాల్సి ఉందని అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు