అలాగైతే బడులు తెరవచ్చు!

4 Feb, 2022 04:20 IST|Sakshi

స్కూల్స్‌ రీఓపెనింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో బడులను తెరవచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. అందుకే బడులు తెరవడంపై మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు.

దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్,  లక్షద్వీప్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్‌ సహా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి స్వీటీ ఛాంగ్సన్‌ చెప్పారు.

అసోం, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, డామన్‌ డయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, పశ్చిమబెంగాల్‌ సహా 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకున్నాయని, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, పుదుచ్ఛేరి, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, దిల్లీ తదితర 9 రాష్ట్రాల్లో  ఇంకా పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని చెప్పారు.

చాలా రాష్ట్రాల్లో స్కూలు సిబ్బంది వ్యాక్సినేషన్‌ పూర్తికావచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉందని పాల్‌ చెప్పారు. కరోనా వల్ల దేశీయ చిన్నారుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని అందరిలో ఆందోళన ఉందన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు బడులు తెరిచేందుకు యత్నించాలన్నారు.

పాఠశాలలకు నూతన మార్గదర్శకాలివే..
► పిల్లల మధ్య 6 అడుగులు దూరం ఉండేలా తరగతుల్లో సీటింగ్‌ ఏర్పరచాలి.
► పాఠశాలలో పరిశుభ్ర వాతావరణం ఉంచుతూ, ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి.
► పాఠశాల బస్సులు/వ్యాన్‌లను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి.
► విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి.  
► పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి.  
► ఒకవేళ తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలి.
► ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, కోవిడ్‌ సోకిన పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలి.

మరిన్ని వార్తలు