‘నాకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి’

10 Aug, 2020 15:42 IST|Sakshi

కనిమొళి ట్వీట్‌పై స్పందించిన చిదంబరం

సాక్షి, న్యూఢిల్లీ : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ డీఎంకే నేత కనిమొళి ‘హిందీ రాకపోతే భారతీయులం కాదా’ అని ప్రశ్నించిన  క్రమంలో ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం సోమవారం స్పందించారు. చెన్నై విమానాశ్రయంలో కనిమొళికి ఎదురైన అనుభవం అసాధారణమైనది కాదని ఆయన చెప్పుకొచ్చారు. తనకూ ఇదే తరహాలో గతంలో ఫోన్‌లో మాట్లాడే సందర్భాల్లో, ముఖాముఖిల్లోనూ హిందీలో మాట్లాడాలని పలువురు కోరారని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి సాధారణ పౌరుల నుంచీ తనకు ఇలాంటి అనుభవాలు పలుమార్లు ఎదురయ్యాయని ఆయన ట్వీట్‌ చేశారు.

హిందీ, ఇంగ్లీష్‌ రెండూ అధికార భాషలైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ రెండు భాషల్లో మాట్లాడేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన హిందీయేతరులు సత్వరమే హిందీలో నైపుణ్యం సాధిస్తుంటే హిందీ మాట్లాడే ఉద్యోగులు ఆంగ్లంలో పట్టుసాధించి ఎందుకు మాట్లాడలేరని ఆయన మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. కాగా కనిమొళికి ఎదురైన అనుభవంపై కాంగ్రెస్‌ నేత, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరన్‌ విస్మయం వ్యక్తం చేశారు. పౌరులకు భాషా పరీక్ష భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని తనకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్‌ఎఫ్‌ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది.

చదవండి : రక్షణ దిగుమతుల నిషేధం : చారిత్రక ప్రకటన ఇదేనా!

>
మరిన్ని వార్తలు