తమిళనాడులో ఘోరం.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా?

25 Dec, 2023 14:10 IST|Sakshi

చెన్నై శివారులోని తాలంబూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నందినిని స్నేహితురాలు మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నందినిని ప్రేమించిన మహేశ్వరి ఆరునెలల కిందటే అబ్బాయిగా మారి వెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది. తన కోసమే లింగమార్పిడి చేసుకున్న తనను నందిని దూరంగా పెడుతుందన్న కోపంతో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు.

స్నేహితుడు లేదా స్నేహితురాలి కోసం లింగమార్పిడి చేసుకున్న తర్వాత తనను పట్టించుకోకపోవడం, వేరొకరితో సన్నిహతంగా ఉండటంతో దాడులు చేసిన ఘటనలు గతంలోనూ వార్తల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో లింగమార్పిడి చుట్టూ ఉన్న సామాజిక సంక్లిష్టతల గురించి, ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం చూపించే తిరస్కరణ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.

అసలు కొందరు వ్యక్తులు జెండర్ ఐడెంటిటీలో ఎందుకు గందరగోళ పడతారనేది సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. జెండర్ ఐడెంటిటీకి జీన్స్ కు మధ్య సంబంధాలను అనేక అధ్యయనాలు గుర్తించాయి. అయితే నిర్దిష్టంగా ఏ జీన్స్ కారణమనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు చిన్ననాటి అనుభవాలు, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి దోహదపడతాయి.

అంటే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్‌గా మారడమనేది వారి ఎంచుకున్నది కాదనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ‘మగ’ లేదా ‘ఆడ’ వర్గాల్లోనే కాకుండా మధ్యలో కూడా ఉండవచ్చు. వారి జెండర్ ఐడెంటిటీని గుర్తించడం, వారు గౌరవంగా జీవించడానికి సహకరించడం అవసరం. అలా జరగనప్పుడు, ఆ గుర్తింపు గౌరవం దొరకనప్పుడు తీవ్రంగా గందరగోళ పడతారు. మానసిక సమస్యలకు లోనవుతారు. తమ సమస్యలకు కారణమైన వారిపై దాడికి కూడా పాల్పడవచ్చు.

ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుంటే జెండర్ ఐడెంటిటీ ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదాహరణకు నా పేరు విశేష్. నేను Psy.Vishesh అని రాస్తా. అంటే సైకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నా. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం, మరోలా పిలిస్తే కష్టంగా ఉంటుంది. పేరు విషయంలోనూ ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు.. బాలికగా పుట్టిన వ్యక్తిలో పురుష భావనలు ఉంటే మనసులో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు అలాంటి భావనలను సమాజమే కాదు కుటుంబం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో తనను పురుషుడిగా అంగీకరించిన స్నేహితురాలు దొరికితే అంతకంటే ఆనందం ఉండదు. ఆ స్నేహితురాలిని, ఆ స్నేహాన్ని శాశ్వతంగా తనది చేసుకోవాలనుకుంటారు.

పురుషుడిగా మారితే నందిని తనను అంగీకరిస్తుందనే, పెళ్లిచేసుకుంటుందనే ఆశతో లేదా అపోహతో మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్‌గా మారింది. కానీ నందిని దూరంగా ఉంచడం మారన్ మనసులో కల్లోలం రేపి ఉండవచ్చు. తనకోసం, తన ప్రేమ కోసం, తనతో జీవితం గడపడంకోసం లింగమార్పిడి సైతం చేయించుకున్నా దూరంగా పెట్టడంతో నందినిపై కోపం ఏర్పడి ఉండవచ్చు. ఆ కోసం హద్దులు దాటి నందిని హత్యకు దారితీసి ఉండవచ్చు.

కోరుకున్నది దక్కనప్పుడు అందరూ ఒకేరీతిలో స్పందించరు. కొందరు తీవ్ర డిప్రెషన్‌కు లోనైతే, మరికొందరు ఫ్రస్ట్రషన్, అగ్రెషన్ కు లోనవుతారు. కారణమైన వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటారు. అప్పటికే జెండర్ ఐడెంటిటీ సమస్యలో ఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతాయి. అప్పటికే సమాజం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తి మనసులో ప్రేమించిన వ్యక్తి తిరస్కరణ మరింత బలమైన గాయాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలు కనిపిస్తుంటాయి.

నందిని హత్య నిస్సందేహంగా బాధాకరం. అయితే ఆ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం పోకడను మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జెండర్ ఐడెంటిటీ అనేది ఏ ఒక్కరి ఎంపిక కాదని, కొందరిలో అది భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆడ, మగలతో పాటు ట్రాన్స్ జెండర్స్‌కు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని గుర్తించాలి. వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి వీలైన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని అందరం అర్థం చేసుకోవాలి.

సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com

8019 000066

>
మరిన్ని వార్తలు