బిడ్డ జాగ్రత్త!.. గడిచిన 6 నెలల్లో 5,167 చిన్నారులు మృతి

16 Nov, 2022 13:45 IST|Sakshi

తల్లిదండ్రులకు ప్రాణమైన పసిపిల్లల జీవితం గాలిలో దీపమైంది. గర్భిణికి సరైన పోషకాహారం అందక బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం, దాని వల్ల పలు రకాల జబ్బులు సోకడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవ సేవల లోపం ఇలా ఎన్నో కారణాలు పసిగుడ్లకు శాపంగా మారాయి. తమ బిడ్డ  పూర్తి జీవితం ఆస్వాదించాలన్న కన్నవారి ఆశ ఊయలలోనే కొడిగడుతోంది. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు శిశువులు, బాలల మరణాల సంఖ్య ఏటా  10 వేల వరకూ ఉంటోంది.

సాక్షి, బెంగళూరు: కోవిడ్‌ మహమ్మారి అనంతరం రాష్ట్రంలో పిల్లల మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో 5 వేలమందికి పైగా బాలలు మృత్యువాత పడ్డారు. ఆరోగ్యశాఖ సమాచార వ్యవస్థలో ఉన్న అంశాలు ఈ విపత్తుకు అద్దం పడుతున్నాయి. గత ఏప్రిల్‌ 1 నుంచి సెపె్టంబరు 30 వరకు ఐదేళ్ల లోపు వయసు కలిగిన 5,167 పిల్లలు పలు కారణాలతో కన్నుమూశారు. ఇందులో 3,648 మంది ఒక నెలలోపు పసికూనలు.  

ఆవేదన కలిగించే మరణాలు 
►ఐదేళ్లలోపు బాలలు ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం 2020–21లో 9,120 మంది,  2021–22 లో 9,050 మంది మరణించారు.  
►2019–20లో 11,504 మంది, 2018–19లో 11,781 మంది ఊపిరి వదిలారు. 
► 2017–18లో 13,635 మంది కన్నుమూశారు.  
చదవండి: షాకింగ్‌! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది

ఇవి కొన్ని కారణాలే  
►కోవిడ్‌ మహమ్మారి సమయంలో పిల్లల మరణాలు తగ్గినప్పటికీ ఆ తరువాత పెరిగాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి పడిపోవడం, అపౌష్టికత పెరగడం కారణం కావచ్చు. 
►కోవిడ్‌ విస్తరించాక ఆస్పత్రుల్లో గర్భిణులకు, బాలింతలకు వైద్యసేవలు అందడం ఆలస్యమైంది.  
►ఘోషా ఆస్పత్రులను కూడా కరోనా వైద్యాలయాలుగా మార్చడం, వైద్యసిబ్బంది కరోనా చికిత్సల్లో నిమగ్నం కావడం తెలిసిందే.  
►అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడి గుడ్లు, పౌష్టిక ఆహారం అందకపోవడంతో పేదవర్గాల తల్లీపిల్లల్లో రక్తహీనత, అపౌష్టికత, అతిసారం వంటివి ప్రబలాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.  
చదవండి: ఆన్‌లైన్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అదృశ్యం

ప్రతి 1000 మందిలో 21 మంది...  
► 2020 సర్వే ప్రకారం కర్ణాటకలో ప్రతి వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లల్లో 21 మంది పిల్లలు మరణిస్తున్నారు. ఈ సంఖ్య కేరళలో 8 మంది, తమిళనాడులో 13 మందిగా ఉంది.  
►శిశు మరణాల్లో దక్షిణ భారత రాష్ట్రాల సగటు.... జాతీయ సరాసరి అయిన 32 కంటే తక్కువగానే ఉంది.  
►రాష్ట్రంలో ప్రతి 1000 మంది ఏడాది వయసులోపు శిశువుల్లో 19 మంది మరణిస్తే అది జాతీయ సగటు  28గా ఉంటోంది. నవజాత శిశు మృతులు 14 ఉంటే జాతీయ సరాసరి 20గా ఉంది.  

వైద్యారోగ్య శాఖ నివారణ చర్యలు  
ఈ నేపథ్యంలో పిల్లల మరణాల అడ్డుకట్టకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు రూపొందించింది. పిల్లలు మృతికి కారణం ఏమిటి? అనే సమాచారం సేకరించి నివారణ చర్యలకు నడుం బిగించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 41 నవజాత శిశువుల ప్రత్యేక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలను, సేవలను ముమ్మరం చేసింది. పిల్లలు మృతుల నియంత్రణకు ప్రసూతి అనంతరం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బసవ రాజదబాడి తెలిపారు.

మరిన్ని వార్తలు