Chahal-Kuldeep Yadav ReUnite Photo: ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసి ఎన్నాళ్లయిందో..

16 Nov, 2022 13:48 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌ ఓటమి అనంతరం స్వదేశానికి చేరుకున్న టీమిండియా.. ఆ వెంటనే మరో సిరీస్‌కు సన్నద్ధమైంది. ఇప్పటికే హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. న్యూజిలాండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా టి20 జట్టుకు పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. వన్డే జట్టును సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ నడిపించనున్నాడు. కాగా నవంబర్‌ 18న కివీస్‌, టీమిండియాలు తొలి టి20 మ్యాచ్‌ ఆడనున్నాయి.

ఈ విషయం పక్కనబెడితే.. టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ షేర్‌ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్వతహాగా లెగ్‌స్పిన్నర్‌ అయిన చహల్‌.. తన పార్టనర్‌.. మరో లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఎన్నాళ్లయింది భయ్యా ఇద్దరం కలిసి అంటూ ట్యాగ్‌ జత చేశాడు.

కుల్దీప్‌ యాదవ్‌ సంగతి పక్కనబెడితే.. యజ్వేంద్ర చహల్‌ టి20 ప్రపంచకప్‌కు లెగ్‌ స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆదిల్‌ రషీద్‌ లాంటి లెగ్‌ స్పిన్నర్‌ వికెట్ల పంట పండిస్తుంటే టీమిండియా మాత్రం చహల్‌కు ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. జట్టుకు ఇది మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో చహల్‌ను ఆడించాల్సిందని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. 

ఇక చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు ధోని, కోహ్లిలు కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వీరిద్దరి జోడి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడమే గాక వికెట్లు తీస్తూ కీలక సమయాల్లో ఒత్తడి పెంచేవారు. కానీ రోహిత్‌ కెప్టెన్‌గా ఎంపికయిన తర్వాత చహల్‌, కుల్దీప్‌లు జట్టుకు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. మరి తాజాగా న్యూజిలాండ్‌తో టి20, వన్డే సిరీస్‌లలోనైనా వీరిద్దరు రాణిస్తారని ఆశిద్దాం.

చదవండి: FIFA: ప్రపంచానికి తెలియని కొల్హాపూర్‌ ఫుట్‌బాల్‌ చరిత్ర

'2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్‌ హాల్స్‌గా మారాయి'

మరిన్ని వార్తలు