దేశంలో వైద్య ‘అవ్యవస్థ’

8 May, 2022 05:16 IST|Sakshi

సీజేఐ జస్టిస్‌ రమణ ఆవేదన

అందరికీ వైద్యమందేలా చూడాలి

డాక్టర్లపై దాడులు దారుణమన్న సీజేఐ

న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి.

పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్‌ మ్యాప్‌ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు.

‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్‌ కల్నల్‌ సీఎస్‌పంత్‌; డాక్టర్‌ వనితా కపూర్‌ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్‌ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు.

వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు