CBSE: ఆగస్ట్‌ 15– సెప్టెంబర్‌ 15 మధ్య ఐచ్ఛిక పరీక్షలు

22 Jun, 2021 06:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు

సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఎస్‌ఈ

సాక్షి, న్యూఢిల్లీ: 12వ తరగతి ఐచ్ఛిక పరీక్షలు ఆగస్టు 15– సెప్టెంబరు 15 మధ్య నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ పేర్కొంది. అదీ పరిస్థితులు అనుకూలిస్తేనే అని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఫలితాల వెల్లడికి కాలపరిమితి నిర్ణయిస్తామని తెలిపింది. ఫలితాల అనంతరం విద్యార్థుల కోసం వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. అసెస్‌మెంట్‌ పాలసీ ప్రకారం జూలై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని, తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఐచ్ఛిక పరీక్షలకు రిజిస్టర్‌ చేసుకోవచ్చని తెలిపింది.

వీరికి పరీక్షల్లో వచ్చి న మార్కులనే తుది ఫలితంగా ఖరారు చేస్తామని వివరించింది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో మూడేళ్ల ప్రతిభను ఆధారంగా మూల్యాంకనం చేస్తామని, 30:30:40 ఫార్ములాను అనుసరిస్తామని సీబీఎస్‌ఈ ప్రతిపాదించగా సుప్రీంకోర్టు ఆమోదించడం తెలిసిందే.

పదో తరగతి మార్కులను 30 శాతానికి, 11వ తరగతి మార్కులకు 30 శాతానికి, 12వ తరగతిలో యూనిట్‌ టెస్టులు, మిడ్‌టర్మ్‌ పరీక్షలు, ప్రీ ఫైనల్స్‌ను కలిపి 40 శాతానికి పరిగణనలోకి తీసుకొని మార్కులకు కేటాయిస్తామని సీబీఎస్‌ఈ వివరించింది. సెప్టెంబర్‌ ఒకటిలోపు పరీక్షలు నిర్వహిస్తామని సీఐఎస్‌సీఈ తెలిపింది.

చదవండి:
ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం

కోల్పోయిన ఆధార్ నెంబర్ తిరిగి పొందడం ఎలా..?

>
మరిన్ని వార్తలు